ఇది కదా.. పెళ్లంటే!

పెళ్లంటే నూరేళ్ల పంట. యువతీ యువకులకదొక మధురమైన ఘట్టం. పెద్దలకు చిరస్మరణీయం. పూర్వం ఇటు వారం – అటు వారం రోజులు ఇల్లంతా సందళ్లు ఉండేవి. ఇవాళ ఆ వేళకు కుదుర్చుకుని మరీ వచ్చి అక్షింతలు వెళ్లే వారే ఎక్కువ. అడిగి మరీ వడ్డన చేసే బంధుగణం లేనేలేరు. బంతి భోజనాలు ఎక్కడో ఒకటీ అర. అన్నీ బఫేలే! అసలు చాలామందికి నేలమీద కూర్చుని నింపాదిగా అరటాకు భోజనము చేసేంత సమయం, శరీర సహకారం కరువైపోయింది.

పై కార్టూన్ నాకు చాలా విషయాలు గుర్తు చేసింది. ఒక్క వీడియోగ్రాఫర్, భాజాభజంత్రీలు తప్ప అందరూ ఉన్నారు ఈ చిత్రంలో. చాలామంది నేలమీదనే కూర్చుని వివాహాన్ని చూస్తున్నారు. పిల్లలూ సరదాగా ఆస్వాదిస్తున్నారు. మగ- ఆడ పెళ్లివారలు తెచ్చిన పూలదండలు, పండ్లు వగైరాలు చక్కగా బొమ్మలో ఇమిడిపోయాయి. అరటి చెట్లు, కొబ్బరి ఆకులతో కట్టినగుంజ, మామిడి, తాటాకు తోరణాలు ఇందులో కనువిందుగా ఉన్నాయి. కొంచెం తలపండిన వారి భుజాలపై చక్కగా, హుందాగా.. ఉత్తరీయాలు ఉన్నాయి. అందరికీ చల్లటి నీళ్లు ఇచ్చి దాహార్తి తీరుస్తున్న పరివారం, నిండైన పురోహితుల వారి రూపం, వారి శిష్యుడు చేస్తున్న సహకారం, వధూవరులు కూర్చున్న‌ తీరుని కుంచెలో మలచిన తీరు అభినందనీయం. ఇక వధువు జడలో ఎర్రటి పూలజడ, పక్కనే రెండు కలశాలు.. వహ్వా!

అందునా, ఈ చిత్రంలో పెళ్లి చూస్తున్న వందమందీ చేతుల్లో చరవాణీలు ( సెల్ ఫోన్) లేవు. పెళ్లికొచ్చి వాళ్లకిష్టమైన వాట్సప్పూ, ఫేస్‌బుక్, యూట్యూబ్ చూసుకోకుండా పెళ్లినే చూడటం మరింత విశేషం.

ఏదేమైనా, కనమరుగవుతున్న బంధాలను, వివాహ వ్యవస్థను మళ్లా గుర్తు చేశారు గుంటూరు సంపత్ నగర్ అయ్యప్ప దేవాలయ అర్చకులు, మా మావయ్య బ్రహ్మ శ్రీ ఘంటసాల నాగేశ్వర శాస్త్రి గారు, అత్తయ్య శ్రీ అన్నపూర్ణమ్మ గార్లు. వారి ముద్దుల మనవరాలు, విజయ కుమారశర్మ / శ్రీదేవి దంపతుల జ్యేష్ఠ కుమార్తె చి.ల.సౌ. శర్వాణీ వివాహము వచ్చే నెల ఏడవతేదీన. ఆ వివాహ శుభ లగ్న పత్రిక మీద ఈ చిత్రాన్ని పెద్ద సైజులో అచ్చు వేయించారు. సహజంగా ఎవరయినా శుభలేఖ ఇస్తే చదివి పక్కన పెట్టుకుంటారు. కానీ మాబోటి ఉప సంపాదకవర్గంలో ఉన్నవారికి అందులోని ప్రతి అంశము పరిశీలన చేయడం అలవాటు. అలా చూడగా ఆకర్షణీయంగా ఉన్న ఈ కార్టూన్ గురించి ఇలా నాలుగు అక్షరాలు పంచుకోవాలనిపించింది.

– సత్యనారాయణ శర్మ శిరసనగండ్ల
గుంటూరు
9492684205