– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
వేల్పూరు, మహానాడు: కలియుగ దైవాన్ని మోసం చేసేవారు ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇప్పటికే దేవుడు, ప్రజలు వారిని శిక్షించారని, ఇప్పటికీ బుద్ధి మారకపోతే మట్టిగొట్టుకు పోవడం ఖాయమన్నారు. శావల్యాపురం మండలం వేల్పూరులో ఇంది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే, కలెక్టర్ పి.అరుణ్‌బాబు, తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించి కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో 100మంచి పనులు చేసిందని ప్రజలకు తెలియజెప్పడం తమ బాధ్యత, కర్తవ్యమన్నా రు.
చంద్రబాబు ఆశయం నెరవేరాలని, 2047 నాటికల్లా ప్రతి కుటుంబం ఆర్థిక ప్రగతి సాధించి సంతోషంగా ఉండాలని, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఏపీ ఉండాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాకారం కోసం ప్రభుత్వం ఒక క్యూఆర్ కోడ్ తెచ్చిందని, దాన్ని స్కాన్ చేసుకొని ప్రతిఒక్కరూ సూచనలు, సలహాలు ఇవ్వాలని సూచించారు. గొప్ప గొప్ప ఆలోచనలను అందించాలని, అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు.
మీరిచ్చే విలువైన సూచనలు, సలహాలు సీఎం చంద్రబాబుకు చేరతాయని, ఏపీని మరింతగా ఎలా అభివృద్ధి చేయాలి, సమస్యలు ఏం ఉన్నాయో తెలుసుకుని వాటిని ఎలా అధిగమించాలో ప్రణాళిక రూపొందిస్తారని తెలిపారు. ముంబయి నటి కేసులో ఐపీఎస్‌లతో పాటు వాళ్లతో అలా చేయించిన వాళ్లను వదిలి పెట్టకూడదని, పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్ గున్నిలను ఆడించిన సూత్రధారి ఎవరో తేల్చాలన్నారు. జగన్, అతడి నెంబర్-2 కనుసన్నల్లోనే ముంబయి నటి అక్రమ అరెస్టు, వేధింపులు జరిగాయని అన్నారు.