అధికారులు సమన్వయంతో పనిచేయాలి
తొలి ఏకాదశి తిరునాళ్ల ఏర్పాట్లపై కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష
వినుకొండ, మహానాడు: ఈనెల 17న తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వినుకొండలో జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి “కొండ”తిరుణాళ్ల ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు అధికారులకు సూచించారు. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరయ్యారు. దేవాదాయ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీ, ఆర్ అండ్ బి, వైద్య , విద్యుత్ తదితర శాఖల అధికారులతో సమీక్షించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాళ్లకు లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన బందోబస్తు నిర్వహించాలని, భక్తులు ఎటువంటి అసౌకర్యాలకు గురి కాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కొండ పైకి ఘాట్ రోడ్డు మార్గాన ఎక్కే భక్తులకు సౌకర్యార్థంగా భారిగేట్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి 250 మీటర్లకు త్రాగునీటి వసతి కల్పించాలని, దేవాలయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొండపై నిర్వహించే అఖండ జ్యోతి కార్యక్రమానికి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. భక్తుల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్స్, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలని సూచించారు.
కొండపై భక్తులు చేరేందుకు ఆర్టీసీ కండిషన్లో ఉన్న బస్సులు ఏర్పాటు చేయాలని, ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే ప్రక్రియలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. బస్సులు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ కి ప్రత్యేక స్థలం కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వినుకొండలో కొండ పండుగ అత్యంత వైభవంగా జరిపి విజయవంతం చేయాలని సూచించారు.
ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వినుకొండ తొలి ఏకాదశి పండుగ, వినుకొండ కొండ తిరునాళ్ల విజయవంతం చేయాలని అధికారులు ఆయన కోరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, త్రాగునీరు ఏర్పాట్లు, భక్తులకు భోజన సదుపాయం, అన్నదాన ప్రసాదాలు, ఘాట్ రోడ్లో వాహన రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
తిరునాళ్ల రియల్ ఎస్టేట్ భూముల్లో కాకుండా, వినుకొండ ఊర్లోనే జరుగుతుందని, ఎలక్ట్రికల్ ప్రభలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంఘిక, పౌరాణిక నాటకాలు, నాటికలకు అనుమతులు ఇచ్చి ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ ప్రభల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.
భక్తుల సౌకర్యార్థం వైద్యశాఖ పట్టణంలో, కొండ వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అలాగే అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని సూచించారు. తొలి ఏకాదశి పర్వదినం రోజున వినుకొండ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీ రామలింగేశ్వర స్వామి తిరుణాల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకునేందుకు అధికారులందరూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే ఈ నెల 17వ తేదీన తొలి ఏకాదశి కొండ తిరునాళ్ల, మొహరం పండుగలు ఒకేరోజు వచ్చాయని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా హిందువులు, ముస్లిం సోదరులు పండుగలు జరుపుకునే విధంగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నరసరావుపేట ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి, ఎండోమెంట్ ఏసీ, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.