టీడీపీలో చేరారన్న అక్కసు ఎస్సీలు, బోయలపై దాడులు
వారిపై తిరగబడ్డ గ్రామస్థులు
ఆలస్యంగా స్పందించిన పోలీసులు
ఫోన్లో ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిటాల సునీత
రాజశేఖర్‌రెడ్డిని జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్
వరుస దాడులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
రాప్తాడు, మహానాడు : రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి దౌర్జన్యకాండకు హద్దే లేకుండాపోయింది. రామగిరి మండలం మాదాపురం ఎంపీటీసీపై దాడి కి తెగబడిన గంటల వ్యవధిలోనే మరోసారి దౌర్జన్యకాండ సృష్టించారు. తన స్వగ్రామం తోపుదుర్తిలో ఎస్సీలు, బోయలు టీడీపీలో చేరారన్న అక్కసుతో శనివారం అర్ధరాత్రి వారి ఇళ్ల పై దాడికి తెగబడ్డాడు. తోపుదుర్తి గ్రామంలో బోయ లింగమయ్య అనే టీడీపీ నాయకుడి ఇంటికి వెళ్లి బెదిరిస్తూ దాడికి ప్రయత్నించగా వారి బంధువులు అడ్డుకుని ప్రతిఘటించారు. గన్మెన్లు, 30 మంది అనుచరులతో వచ్చి కులం పేరుతో దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరిస్తూ దాడికి ప్రయత్నించారు.
జరుగుతున్న ఘటనను ఒక వ్యక్తి సెల్ఫోన్లో రికార్డ్ చేస్తుండగా వారిపై కూడా దాడి చేసి మొబైల్స్ లాక్కెళ్లారు. రాజశేఖర్‌రెడ్డి ఆదేశాలతో మరోసారి టీడీపీ నాయకుడు ఉరుముల వన్నూరప్ప ఇంటికి 30 మంది అనుచరులు వెళ్లారు. వన్నూర ప్పను అతని కుటుంబసభ్యులను ఎమ్మెల్యే ఇంటికి లాక్కొని వెళ్లారు. తోపుదుర్తి అనుచరుడు కుమార్‌రెడ్డి వన్నూరప్పపై దాడి చేసి రాజశేఖర్‌రెడ్డి కాళ్లు పట్టుకుని క్షమించమని వేడు కోవాలని బెదిరించాడు. చివరికి అతని తల్లి కాళ్లమీద పడి వేడుకోగా వదిలేశారు. అదే సమ యంలో సీఐ, ఎస్ఐలకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా ఎస్ఐ సీఎం డ్యూటీలో ఉన్నానని తెలిపారు. సీఐ ఫోన్ తీయకపోవడం అనుమానాలకు తావిచ్చింది. తెల్లవారుజామున 2 గంటలకు ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికి చేరుకుని ఏం జరిగిందని తీరిగ్గా ఆరా తీశారు.
రాజారెడ్డిని జిల్లా బహిష్కరణ చేయాలి: పరిటాల సునీత
ఈ సంఘటనపై మాజీ మంత్రి పరిటాల సునీత వెంకటాపురంలో తీవ్రంగా స్పందించారు. విషయం తెలిసిన వెంటనే ఎస్పీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. దాడి జరుగుతుందని సీఐ, ఎస్ఐ లకు సమాచారం ఇచ్చినా ఎందుకు స్పందించలేదన్నారు. గతంలో కూడా తోపుదుర్తిలో బెదిరిం పులకు పాల్పడుతున్నారని, దాడులు జరిగాయని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గన్మెన్లతో ఇలా దాడులు చేసి బెదిరిస్తుంటే ఎన్నికలు ఎలా సజావుగా జరుగుతాయని ప్రశ్నించారు.
పైగా తమకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రతిరోజు 200 మందికి పైగా వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారని దీనిని జీర్ణించుకోలేక దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు చేతనైతే మీ పార్టీ నాయకులకు సర్ది చెప్పి పార్టీలో ఉండేలా చేసుకోవాలి..ఇలా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. దాడులు చేస్తుంటే పోలీసులు సరైన సమయంలో స్పందించలేదని.. ఇప్పటికే దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని, మరోవైపు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రాజారెడ్డి లాంటి వ్యక్తులు ఎన్నికల సమ యంలో జిల్లాలో ఉండకూడదని, జిల్లా బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు..