నాగార్జున సాగర్‌ కు పోటెత్తిన పర్యాటకులు

నల్గొండ: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పర్యాటక కేంద్రం నాగార్జున కొండ ఆదివారం పర్యాటకులతో కిక్కిరిసింది. నాగార్జున సాగర్ డ్యాం గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేయడం తో పర్యాటకుల రాకపోకలు మరింత పెరిగాయి.

సెలవు దినం కావడంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో పర్యాటకులు సాగర్‌ డ్యాంకు తరలివచ్చారు. సాగర్ గేట్ల నుండి నీరు జాలువారుతుండగా, ఈ అందాలను వీక్షిస్తూ పర్యాటకులు మైమరచిపోయారు.

పర్యాటకులు శాంతిసిరి మరియు నాగసిరి లాంచీలలో నాగార్జున కొండకు చేరుకున్నారు. కృష్ణమ్మను రిజర్వాయర్ గేట్ల నుంచి వదులుతుండగా, ఆ అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులు పరవశించి ఆహ్లాదంగా గడిపారు.

ఇక సాగర్ పరిసర ప్రాంతాలు పర్యాటకుల కేరింతలతో మార్మోగిపోయాయి. మరోవైపు, పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. ప్రధాన డ్యామ్ మరియు పవర్ హౌస్ ప్రాంతాల్లోకి పర్యాటకులను వెళ్లకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.