-భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం
-బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
హైదరాబాద్, మహానాడు: ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతితక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శంషాబాద్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో నవంబరు 2023లో జరిగిన శాసనసభ ఎన్నికలు, 2024 ఏప్రిల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత జరగుతున్న విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి వచ్చిన కార్యకర్తలందరికీ నమస్కారం. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కోసం పూర్తి సమయాన్ని కేటాయించి, పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలందరికీ బిజెపి రాష్ట్ర పార్టీ తరఫున వందనాలు.
తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాగ్రహానికి గురై ఓటమిపాలైంది. అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పది సంవత్సరాల పాటు బూత్ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీజేపీ కార్యకర్తలు నిరంతర పోరాటాల్లో నిమగ్నమై కష్టపడిన ఫలితంగా 2018లో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచిన మన పార్టీ ఈ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 7 శాతం మాత్రమే ఉన్న ఓట్లుకు 15 శాతానికి పెంచుకోగలిగాం. ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి 8 లోక్ సభ స్థానాల్లో విజయాన్ని అందించారు. 46 శాసనసభ స్థానాల్లో ఆధిక్యంతో పాటు, 44 స్థానాల్లో రెండో స్థానాన్ని ఇచ్చి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బిజెపియే ప్రధాన ప్రత్యామ్నాయమనే తీర్పునిచ్చారు.
శాసనసభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ మనం అనేక ఉద్యమాలు నిర్వహించాం. అన్ని వర్గాల ప్రజల సమస్యలపై పోరాటాలు చేశాం. ఫలితంగా బీఆర్ఎస్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొన్నప్పటికీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ‘బీఆర్ఎస్-బీజేపీ ఒక్కటేననే తప్పుడు ప్రచారం, అమలుకు నోచుకోని గారడీ గ్యారంటీల వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచింది. శాసనసభ ఎన్నికల తర్వాత వెంటనే పార్లమెంటు ఎన్నికల కోసం కార్యకర్తలందరు శ్రమించిన ఫలితంగా 5 నెలల్లో పార్లమెంటు ఎన్నికల్లో మంచి విజయం సాధించాం. ఇది పూర్తిగా కార్యకర్తల విజయం.
మోదీ గారి నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలకున్న నమ్మకాన్ని ప్రతిబింబించేలా, 1980లో బిజెపి ఏర్పడినప్పటి నుంచి మొదటిసారిగా బిజెపి తెలంగాణ ప్రాంతంలో 8 పార్లమెంటు సీట్లు గెలవడమే కాక, 35 శాతం పైగా ఓట్లు సాధించడం, పది సంవత్సరాలు అధికారంలో ఉ న్న బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా పొందలేక మూడో స్థానంలోకి చేరడం, రాబోయే రోజుల్లో మారనున్న తెలంగాణ రాజకీయాలకు దిక్సూచిగా మారింది.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీజేపీదే అధికారం. రాష్ట్రంలో అనేక తప్పుడు వాగ్ధానాలతో ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అతితక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. సోనియాగాంధీ మొదలు రేవంత్ రెడ్డి వరకు 6 గ్యారంటీలు, 13 వాగ్ధానాలు, 66 అంశాలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని చెప్పి 7 నెలల పాలన పూర్తయినా ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయకపోవడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
 
								