విలువలతో కూడిన విద్య అవసరం

– ఎస్పీ సరిత

గుంటూరు, మహానాడు: నేటి విద్యా విధానంలో విలువలతో కూడిన బోధన అవసరమని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.జి.వి. సరిత పేర్కొన్నారు. ఇక్కడి భాష్యం విద్యాసంస్థల ఆడిటోరియంలో బుధవారం జరిగిన మానవత ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విద్యార్థులలో మానవత విలువలు, పోటీ తత్వం, సానుకూల దృక్పథాలను చిన్న వయసు నుండే నేర్పాలని కోరారు. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం అంతర్జాతీయ క్రీడల్లో ఆరు పథకాలు పొందితే, చైనా 96 పథకాలు సాధించిందని, మన యువతను సరైన మార్గంలో నడిపించడంలో విఫలమయ్యామన్నారు.

బాలికలపై లైంగిక వేధింపులు, అకృత్యాలు పెరుగుతున్నాయని, సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ లు పిల్లలను పక్కదారి పట్టిస్తున్నాయని, తల్లిదండ్రులు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు . మానవత స్వచ్ఛంద సేవా సంస్థ గత రెండు సంవత్సరాలుగా గుంటూరులో మానవత్వాన్ని నింపే బహుముఖ కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. నేర పరిశోధన విభాగ డి.యస్.పి. గోలి లక్ష్మయ్య ప్రసంగిస్తూ విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత నేటి సమాజంపై ఉందన్నారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రసంగిస్తూ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి రోజున మానవత ఆవిర్భావ దినోత్సవ సభ జరుపుకోవడం హర్షనీయమన్నారు.

బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 60 వేల రూపాయల విలువ చేసే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ మెటీరియల్ తో కూడిన 200 పుస్తకాలను నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు అందివ్వడం అభినందనీయమన్నారు. మానవత చైర్మన్ పావులూరి రమేష్, మానవత అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కార్యదర్శి వి. నాగేశ్వరరావు, మానవత కోశాధికారి టీ.వి. సాయిరాం, టి. ధనుంజయ రెడ్డి, చావా శివాజీ, బి .ఎన్. మిత్ర, ఉప్పల సాంబశివరావు, ఎన్. సాంబశివరావు, వి. సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.