– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్: రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ ‘వెమ్ టెక్నాలజీస్’ మొదటి దశ ప్రాజెక్టులో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. జహీరాబాద్ నిమ్జ్ లో 511 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్ కు సిద్ధమవుతుందని తెలిపారు.
మొదటి దశ పూర్తయితే వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని శ్రీధర్ బాబు వివరించారు. గురువారం నాడు సచివాలయంలో ‘వెమ్ ఇండస్ట్రీస్’ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. కేటాయించిన భూమిలో ఇంకా స్వాధీనం చేయాల్సిన 43 ఎకరాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతికి శ్రీధర్ బాబు సూచించారు.
ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన 33 కె.వి విద్యుత్తు లైన్లను నాలుగు నెలల్లో ఏర్పాటు చేసి సరఫరా ప్రారంభించాలని ట్రాన్స్ కో అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు మధ్యలో నుంచి వెళ్తున్న రోడ్లను ప్రత్యామ్నాయ మార్గాల్లో నిర్మించాలని అన్నారు. పాత విద్యుత్తు లైన్లు, ఆప్టిక్ ఫైబర్ కేబుళ్లు, గ్రామీణ మంచినీటి సరఫరా లైన్లను మళ్లించాలని సూచించారు.
సమావేశంలో వెమ్ టెక్నాలజీస్ సిఎండీ వి. వెంకటరాజు, సంస్థ ప్రతినిధులు ఆర్ ఎస్ ఎస్ రావు, కె.రంగరాజు, ఆర్.వి.రమణ, డివిఎస్ రాజు, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంత్రి, టీజీఐఐసి ఎండీ విష్ణువర్దన్ రెడ్డి, తెలంగాణా ట్రాన్స్ కో డైరెక్టర్ జగత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.