– విమ్స్ డైరెక్టర్ రాంబాబు
విశాఖపట్నం, మహానాడు: విజయ దశమి పండుగ అందరి జీవితాల్లో ఆనందం నింపాలని విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు ఆకాంక్షించారు. ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో జర్నలిస్టుల దసరా పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాంబాబు మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులు నిత్యం పని ఒత్తిడిలో ఉంటూ విశ్రాంతి లేని బిజీ జీవితం గడుపు తున్నారని వారికి, వారి కుటుంబాలకు ఇటువంటి పర్వ దినాలు ఆహ్లాదం, ఆనందం కలిగిస్తాయన్నారు. జర్నలిస్ట్ లు ఆరోగ్య సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాంబాబు సూచించారు. విమ్స్ లో జర్నలిస్ట్ లకు పూర్తి స్థాయిలో ఉచిత సేవలు నిరంతరం అందిస్తామన్నారు.
ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఆంజనేయులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ విజయ దశమి పర్వదినంతో ప్రతీ ఒక్కరు మరింత ఉన్నతంగా ఉండాలని ఆకాంక్షించారు. జర్నలిస్టుల జీవిత లక్ష్యమైన ఇండ్ల స్థలాల సాధన కోసం ప్రభుత్వ పెద్దలను పలుమార్లు కలిసి విన్నవించామని తెలిపారు. అది త్వరలోనే కూటమి ప్రభుత్వం ద్వారా సిద్ధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యలు పరిష్కారం కోసం గట్టిగా ప్రయత్నిస్తామన్నారు. త్వరలో మంత్రులు ద్వారా జర్నలిస్ట్ ల సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామన్నారు.
జర్నలిస్టుల సంఘం నగర అధ్యక్షుడు పోతుమహంతి నారాయణ్ మాట్లాడుతూ జాతీయ జర్నలిస్టుల సంఘం జర్నలిస్టుల సంక్షేమానికి పూర్తిగా కట్టుబడి ఉందని, ఈ దసరా సందర్భంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి సంబరాలు ఘనంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలు సంగీత సాహిత్య నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. లక్కీ డిప్ ద్వారా ఎంపికైన వారికి పలు బహుమతులను అందించారు.
అర్బన్ యూనిట్ ప్రధాన కార్యదర్శి జి.శ్రీనివాస్ రావు, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, జర్నలిస్టుల ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ.సాంబశివరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రవికుమార్, పితాని ప్రసాద్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వై.రామ కృష్ణ, ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్, కార్యదర్శి శ్రీనివాసరావు, వివిధ కార్యవర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు.