వినుకొండ – గుంటూరు నేషనల్ హైవే త్వరలో విస్తరణ

– బ్రిడ్జి పనుల శంకుస్థాపనలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

వినుకొండ, మహానాడు: వినుకొండ మండలంలోని అందుగుల కొత్తపాలెం వద్ద గుళ్ళకమ్మ నదిపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, వినకొండ శాసన సభ్యుడు జీవి ఆంజనేయులు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పార్లమెంటు పరిధిలో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పి.ఎం.జి.ఎస్.వై) పథకం ద్వారా 700 కిలోమీటర్ల రోడ్లు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలిపారు. అలాగే, వినుకొండ నియోజకవర్గంలో 100 కిలోమీటర్ల పైగా రోడ్లు నిర్మాణానికి అంచనాలు వేశామని, ఈ పథకం ద్వారా కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులతో పనులు చేస్తామని తెలిపారు.

వినుకొండ గుంటూరు నేషనల్ హైవే విస్తరిస్తుందని, పనులు త్వరలో ప్రారంభించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. కో-ఆపరేటివ్ సొసైటీల ద్వారా అనేక రుణాలు పొందే అవకాశం ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ అందుకుల కొత్తపాలెం, నాగిరెడ్డిపల్లి మధ్య గుండ్లకమ్మ పై హై లెవెల్ బ్రిడ్జిని పీఎంఈజీఎస్ పథకం ద్వారా 15.83 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నట్టు తెలిపారు. అలాగే పువ్వాడ, గోకనకొండ వద్ద గుండ్లకమ్మ నదిపై మరో హై లెవెల్ బ్రిడ్జిని త్వరలో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నామని తెలిపారు. గుండ్లకమ్మ నదిపై బ్రిడ్జిలు నిర్మించడం వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తొలగిపోతాయని వివరించారు.

గుండ్లకమ్మ నదిపై త్వరలో చెక్ డ్యామ్ల నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంఎన్ఆర్ఇజిఎస్ పథకం ద్వారా నియోజకవర్గంలోని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు 10 కోట్లు నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వినకొండ అభివృద్ధికి ఎంపీ అందిస్తున్న సహకారాలు అభినందనీయమన్నారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన నాయకులు శ్రీనివాసరావు, జెడ్‌పిటీసీ జడ్డారామయ్య సుబ్బులు, టీడీపీ నాయకులు వంకాయలుపటీ పేరయ్య, ముండ్రు సుబ్బారావు, గంగినేని ఆంజనేయులు, మాదినేని ఆంజనేయులు, గంగినేని బాబు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, టీడీపీ నాయకుడు కర్లకుంట వెంకట నరసయ్య, జిల్లా ప్రసాదు, ముతినేని ఏడుకొండలు, కర్ణాట వెంకట రెడ్డి, మొద్దుకోరి రాంబ్రహ్మం , వజ్రాల కృష్ణారెడ్డి, పలువురు వినుకొండ నూజెండ్ల, తదితరులు పాల్గొన్నారు.