కొత్త రైళ్ళకు ప్రతిపాదనలు
.విశాఖ బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు పై విజ్జప్తి
విశాఖపట్నం: డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో శనివారం విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎమ్.శ్రీభరత్, స్థానిక శాసన సభ సభ్యులతో కలసి రైల్వే కు సంబంధించిన వివిధ అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుతం విశాఖపట్నం పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులు, రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైళ్ల ప్రతిపాదనలు, తదితర ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
అమృత్ భారత్ స్కీం కింద విశాఖపట్నం, సింహాచలం, కొత్తవలస స్టేషన్లకు మంజూరైన నిధులు, వాటి పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్.శ్రీభరత్ ఈ ప్రాజెక్టులు ప్రాంతీయ రవాణా మెరుగుపరచడంలో కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
విశాఖపట్నం లోని పోర్టులు, స్టీల్ ప్లాంట్, ఇతర పరిశ్రమలు రైల్వే మార్గాల ద్వారా భారీగా రవాణా చేస్తున్న నేపథ్యంలో, ప్రత్యేక లైన్ల ఏర్పాటుకు, రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన వివరాలను అధికారులతో చర్చించారు. దువ్వాడ స్టేషన్ లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కు స్టాప్ ఇవ్వాలనే ప్రతిపాదనను కూడా అధికారుల ముందుకు ఉంచారు. దీనిపై సానుకూల స్పందన లభించింది. ఇది దువ్వాడ ప్రాంత ప్రయాణికులకు అనేక ప్రయోజనాలను అందిస్తుందని శ్రీభరత్ అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నం-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలును వారంలో మూడు రోజులు నడపాలని, వీలైనంత త్వరగా ఈ సర్వీసును ప్రారంభించాలన్న ప్రాధాన్యతను , విశాఖ లోని వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ ను రైల్వే అధికారులకు ఆయన వివరించారు. ఇది రెండు నగరాల మధ్య రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరచడమే కాకుండా, ఆర్థిక, వ్యాపార సంబంధాలను కూడా బలపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
విశాఖపట్నం రైల్వే జోన్ పై కూడా ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించారు. రైల్వే జోన్‌కు సంబంధించిన పనులు, కేటాయించిన నిధులు, భూమి కేటాయింపు తదితర విషయాలను సమీక్షించారు. రానున్న రోజుల్లో జోన్ అభివృద్ధి పనుల పురోగతిపై మరింత స్పష్టత ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు.
గాజువాక లో రైల్వే కు సంబంధించిన పనుల గురించి చర్చించారు. తుంగ్లాం భూ సమస్య, వడ్లపూడి వద్ద రైల్వే డ్రైనేజీ సమస్య వంటివి, సింహాచలం, మర్రిపాలెం, గోపాలపట్నం, కంచరపాలెం వంటి ప్రదేశాల్లో రైల్వే కు సంబంధించిన పలు అంశాలను కూడా సమావేశంలో చర్చించారు.
సమీక్షా సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు , విశాఖపట్నం పార్లమెంటరీ అధ్యక్షులు గండి బాబ్జి , విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు , ఈ సమావేశం లో డివిజన్ రీజినల్ మేనేజర్ సౌరభ్ ప్రసాద్ , డివిజనల్ ఇంజనీర్ జగదీశ్వర రావు , డివిజన్ ఆపరేషన్స్ మేనేజర్ తన్మయ్ , ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇంచార్జి సునీల్ పాల్గొన్నారు.