అవినాష్‌రెడ్డి నిందితుడు…
జగన్ కొమ్ము కాస్తున్నాడు
అన్యాయం వైపు నిలబడ్డాడు
పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి
బద్వేల్, మహానాడు : బద్వేల్ నియోజకవర్గం బి.కోడూరు మండలంలో కడప ఎంపీ అభ్యర్థి, పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించారు. జగన్ వైఎస్ కొడుకు.. ఆయన ఆశయాలు నిలబెడతాడనుకున్నా..ఆయన కోసం 3200 కి.మీ పాదయాత్ర చేశా. ఈరోజు ఎందుకు జగన్‌ను ఎదిరించి వ్యతిరేకంగా నిలబడ్డానో ఆలోచన చేయాలని కోరారు. వైఎస్ వివేకా ఆత్మ ఇంకా ఘోషిస్తోంది. న్యాయం కోసం ఆయన ఆత్మ పరితపిస్తుంది. అన్యాయంగా వివేకాను పొట్టన పెట్టుకున్నారు. ఎవరు చంపారో.. చంపించారో అందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి నిందితుడు అని అందరికీ తెలుసు.
సీబీఐ సాక్ష్యాధారాలు చూపించింది. అయినా జగన్ నిందితుల పక్షాన నిలబడ్డాడు. అన్యాయం వైపు జగన్ నిలబడ్డాడు. రూ.40 కోట్ల సుఫారి మాట్లాడుకున్నట్లు…రూ.5 కోట్లు అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు సాక్ష్యాలు ఉన్నాయి. అయినా నిందితుడికి మళ్లీ సీట్ ఇచ్చారు. నిందితులను మళ్లీ చట్టసభలకు పంపాలని చూస్తున్నారు. ఇది అన్యాయం..అధర్మం. నేను పులి బిడ్డ… అన్యాయాన్ని ఎదిరించేందుకు పోటీ చేస్తున్నా. ఇది ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధం. న్యాయానికి, అన్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం. కడప ప్రజలు ఎటువైపు నిలబడతారో ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు.