-నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించా
-విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి
విజయవాడ : అభ్యర్థుల గురించి ప్రజలకు అంచనా ఉండాలని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చనుమోలు ఫ్లై ఓవర్ సమీపంలోని రామరాజ్య నగర్ ప్రాంతంలో మంగళవారం పర్యటించారు.
సాయి అమరావతి హైట్స్, అస్త్ర అపార్ట్ మెంట్స్, , శివదుర్గ ఎన్ క్లేవ్ వాసులతో ముఖాముఖి మాట్లాడారు. సమస్యలను సూచనలను స్వీకరించారు. విజయవాడకు దూరంగా ఉన్న రామరాజ్య నగర్ లో తాగునీరు కలుషితమవుతోందని, డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని మౌలిక సదుపాయాలు కల్పించాలని సుజనాను స్థానికులు అభ్యర్థించారు. సుజనాకు అసోసియేషన్ పెద్దలు వారణాసి సూర్యప్రకాష్ ఉమాశంకర్ స్వాగతం పలికారు.
ప్రజాస్వామ్యంలో ఓటు శక్తివంతమైన ఆయుధమని, పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై సరైన నిర్ణయం తీసుకోవాలని సుజనా కోరారు. మంత్రిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గ అభివృద్ధి సంక్షేమాన్ని విస్మరించారని దుయ్యబట్టారు. ప్రజలు ఓడిస్తారని తెలిసే పక్క నియోజకవర్గానికి వెల్లంపల్లిని బదిలీ చేశారని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వ్యక్తి కార్పొరేటర్ గా డివిజన్ అభివృద్ధి కోసం ఏం చేశారో ప్రజలకు కూడా అంచనా ఉండాలన్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన ఒక్క అభివృద్ధి పని కూడా తనకు కనిపించలేదన్నారు. ఏ మొహం పెట్టుకుని వైసీపీ నాయకులు ఓట్లు అభ్యర్థిస్తున్నారొ అడగాలన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయని నాయకులను ప్రజలందరూ నిలదీయాలన్నారు. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచాలని గత ఎన్నికల కంటే ఓటింగ్ పెరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించానని సుజనా వివరించారు. విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బొమ్మసాని సుబ్బారావు, స్థానిక పెద్దలు జెమిని సుధాకర్, నందిరాజు, గాలి రాధాకృష్ణ చింతాడ రాము ,రమేష్, పవన్ స్థానిక మహిళలు, కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్ లోని రాజా మాణిక్యం ఎన్ క్లేవ్ ను కూడా సుజనా సందర్శించారు అపార్ట్ మెంట్ వాసులతో మాట్లాడి సమస్యలను సూచనలను విన్నారు. త్రాగునీరు కలుషితమవుతున్నాయని స్థానిక మహిళలు చెప్పగా సమస్యలను పరిష్కరిస్తానని సుజనా హామీ ఇచ్చారు.స్థానిక పెద్దలు ఈటే వంశీ ,చల్లా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.