పోస్టల్‌ బ్యాలెట్‌ బదులు ఈవీఎంతో ఓటింగ్‌

చిలకలూరిపేటలో ఎన్నికల అధికారి తప్పిదం
ఓట్లు చెల్లుబాటు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఈసీదే
మే 14న చెన్నై తెలుగు విద్యార్థుల పరీక్షను రీ షెడ్యూల్‌ చేయాలి
ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేత వర్ల రామయ్య వినతి

మంగళగిరి, మహానాడు : చిలకలూరిపేటలో పోస్టల్‌ బ్యాలెట్‌కు పేపర్లు ఇవ్వాల్సింది పోయి ఎన్నికల అధికారి అయిన తహసీల్దారు ఏకంగా ఈవీఎంను ఉపయోగించారని, వారు చేసిన తప్పుకు ఓట్లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవా లని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాకు సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వినతిపత్రం ఇచ్చారు. ఈ సంఘటనను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. అలాగే రాష్ట్రంలో మే 13న ఎన్నికల దృష్ట్యా తమిళనాడులో చదువుకుంటున్న 30 వేల మంది ఓటు హక్కుకు వస్తారని, అక్కడ మే 12, 14న అక్కడ పరీక్ష ఉండటంతో పరీక్ష రాసి ఇక్కడకు వచ్చి మళ్లీ ఒక్కరోజులో తిరిగి వెళ్లడం సాధ్యం కానందున అక్కడి విద్యాసంస్థలు, అమరావతిలోని విట్‌ యూనివర్సి టీలు పరీక్షల షెడ్యూల్‌ను రీ షెడ్యూల్‌ చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు.

ఎన్నికలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించడానికి నూతన డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్‌ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్సీ ఎ.ఎస్‌.రామకృష్ణ, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీని వాసరెడ్డి, తెదెపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌, తెదెపా ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరి అఖిల్‌, గుంటూరు మిర్చి యార్డ్‌ మాజీ చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.