ఐదేళ్లలో అన్ని వర్గాలకు అన్యాయం
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
గ్రామాలలో జోరుగా ఎన్నికల ప్రచారం
సత్తెనపల్లి, మహానాడు : సంపద సృష్టించే నాయకుడు కావాలో…దోచుకునే వాడు కావాలో ఆలోచించుకోవాలని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కోరారు. సత్తెనపల్లి రూరల్ మండలం దీపాల దిన్నేపాలెం, అబ్బూరు గ్రామాల్లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియో జకవర్గం యువ నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరావు ఆయన వెంట ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ టీడీపీ సూపర్ 6 పథకాలు వివరించారు. ఐదేళ్ల జగన్ పాలనలో నిరుద్యోగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, హామీలు నెరవేర్చి ఓట్లు అడుగుతా అని చెప్పి ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని ఓట్లడుగుతావో చెప్పాలని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనలో రోడ్లు వేయలేదు..ప్రాజెక్టులు లేవు.. పరిశ్రమలు లేవు.. ఉద్యోగాలు లేవు..అభివృద్ధి అనేది లేదు. విధ్వంసమే జగన్ విధానం.
తన రాజకీయ స్వార్థం కోసం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడమే తెలుసు. ఏ ఒక్క వర్గానికైనా న్యాయం జరగలేదు. దళితులను మోసం చేస్తూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి కూడా అమలు చేయని జగన్‌కు దళితులను ఓటు అడిగే హక్కు లేదన్నారు. ముస్లిం లకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఆర్థికంగా, రాజకీయంగా మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమని, వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ పథకాలను రద్దు చేసిందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఏ బటన్ నొక్కాలో ఆలోచించి నొక్కాలని, విధ్వంస పాలనకు ముగింపు పలికి వెలుగునిచ్చే పాలన తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.