Mahanaadu-Logo-PNG-Large

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ప్రతి ఎకరాకు సాగునీరు

*టెండర్లు పిలిచి త్వరలోనే పోలవరం ఎడమ కాల్వ పనులు ప్రారంభం
*రూ.800 కోట్లతో మొదటి దశ పనులు చేపట్టి 2.20 లక్షల ఎకరాలకు సాగునీరు
*కృష్ణా-గోదావరి-పెన్నా-వంశధార నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రంలో కరవు ఉండదు
*భగవంతుడు ఇచ్చిన శక్తితో మీ రుణం తీర్చుకుంటా
*గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయించింది
*అసమర్థతో మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూత…రైతులకు న్యాయం చేస్తాం
*అధికారులు కార్పెట్ కల్చర్ మానుకోవాలి
*-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
*అనకాపల్లి జిల్లా దార్లపూడి వద్ద పోలవరం ఎడమ కాల్వను పరిశీలించిన సీఎం

పాయకరావుపేట/దార్లపూడి: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తైతే ఉత్తరాంధ్రలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సుజల స్రవంతిని పూర్తి చేస్తే ఉత్తరాంధ్ర ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లాలో 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది. సుజల స్రవంతి పనుల్లో టీడీపీ హయాంలో చేసిన పనులు తప్ప గత ప్రభుత్వంలో ఒక్క ముందడుగు పడలేదన్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని, ఒక్క ఇంచు కూడా పని ముందుకు కదల్లేదన్నారు. ఐదేళ్లలో ఎక్కడైనా తట్ట మట్టి వేశారా? అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం దార్లపూడి వద్ద గురువారం పోలవరం ఎడమ కాల్వను పరిశీలించారు. అంతకుముందు కాల్వ పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పర్యటనకు వచ్చిన సీఎంకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ప్రజల రుణం తీర్చుకునే బాధ్యత నాపై ఉంది
‘ఓట్లు వేసి గెలిపించిన వారి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల తర్వాత ఎక్కువ ఆదరించిన ప్రాంతం ఉత్తరాంధ్ర. కూటమి అభ్యర్థులను మంచి మెజారిటీతో గెలిపించారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చా. భగవంతుడు నాకు ఇచ్చిన శక్తినంతా ఉపయోగించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటా. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా వచ్చాయి. అరాచకాలు చేసిన వ్యక్తిని, తప్పులు చేసిన వ్యక్తిని ప్రజాకోర్టులో శిక్షించారు. రాజకీయాల్లో విర్రవీగితే సరిచేసే శక్తి ప్రజలకే ఉంది.

ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలబడాలని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ఇప్పుడు ప్రజలు గెలిచారు..రాష్ట్రాన్ని నిలబెట్టడానికి మేము కష్టపడతాం. ఇప్పటికే పోలవరం, అమరావతి, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశాం. పోలవరంను 72 శాతం నేను పూర్తి చేశాను. ఒక దుర్మార్గుడు వచ్చి డయాఫ్రం వాల్ ను గోదావరిలో కలిపేశారు. కాఫర్ డ్యామ్ లు డ్యామేజ్ అయ్యాయి. 2021 జూన్ కు నీళ్లు రావాల్సి ఉండగా నిర్వీర్యం చేశారు.

పోలవరం రాష్ట్రానికి వరం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి పోలవరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొస్తే ప్రతి ఎకరాకు నీరు అందించొచ్చు.. కరువు అనే సమస్య ఉండదు. గత ప్రభుత్వ నిర్వాకంతో పోలవరం పూర్తవ్వడానికి ఆలస్యం అవుతోంది. అందువల్ల పురుషోత్త పట్నం, పుష్కర్ లిఫ్ట్ ద్వారా 2,500 క్యూసెక్కుల నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావొచ్చు. అండర్ పాస్ లకు కూడా టెండర్లు పిలిచి త్వరితగతిన పూర్తి చేస్తాం.’ అని సీఎం తెలిపారు.

నదుల అనుసంధానంతో కరవు నివారణ
‘ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో కుడి కాలువ 214 కి.మీ పూర్తి కావాల్సి ఉంది. మొదటి విడతగా కాలువను 93 కి.మీ పూర్తి చేయడానికి రూ.800 కోట్లు ఖర్చు అవుతుంది. దీంతో లక్ష ఎకరాలకు అనకాపల్లి పరిధిలో నీరందించవచ్చు. ఇప్పుడే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. యాక్షన్ ప్లాన్ తయారు చేశాక మరింత వేగవంతంగా పనులు పూర్తి చేస్తాం. ఉమ్మడి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పోలవరం కుడి కాల్వ ద్వారా సాగునీరు అందించవచ్చు.

23 టీఎంసీల నీళ్లతో అనకాపల్లి జిల్లాలో ఇంటింటికీ కుళాయిల ద్వారా నీరందించవచ్చు. రూ.800 కోట్లు ఖర్చు చేసి 93వ కి.మీ వరకు 2.20 లక్షల ఎకరాలకు నీరందించేందుకు మొదటి విడతలో పనులు పూర్తి చేస్తాం. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార నది దాకా వెళ్తుంది. వంశధార-గోదావరి-కృష్ణా-పెన్నా నదులు అనుసంధానం చేసి రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాం.’’ అని సీఎం స్పష్టం చేశారు

గత ప్రభుత్వ అసమర్థ కారణంగా 3 షుగర్ ఫ్యాక్టరీలు మూత
‘‘ఈ ప్రాంతంలోని షుగర్ ఫ్యాకర్టీ రైతులకు కూడా హామీ ఇస్తున్నా.. గత అసమర్థ ప్రభుత్వం కారణంగా 3 షుగర్ ఫ్యాక్టరీలు పడకేశాయి. ఇక్కడి రైతులకు కూడా న్యాయం జరగాలి.. వారి భాగస్వామ్యంతోనే ఫ్యాక్టరీలు నడవాలి. రైతులకు న్యాయం చేస్తాం. శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తాం. నేను కష్టపడతాను.. సంపద సృష్టించి ఆదాయం పెంచి పేదలకు పంచుతాం. మీకు వెసులుబాటు ఇవ్వాల్సిన బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉంది. దేశంలో ఎక్కడా ఇవ్వని విజయాన్ని ఏపీ ప్రజలు ఎన్డీయేకు ఇచ్చారు. ఇది చారిత్రక విజయం. 95 వేల మెజారిటీతో అభ్యర్థులను గెలిపించారు. మీ రుణం తీర్చుకోవడం మా బాధ్యత. దొంగ మాటలు చెప్పేవాళ్ల మాటలు నమ్మి బజారులో తిరగనిస్తే బతుకులు ఏమవుతాయో ఆలోచించాలి.’’ అని సీఎం పిలుపునిచ్చారు

విశాఖ స్టీల్ ప్లాంట్ పై తప్పుడు ప్రచారం
‘‘విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏ విధంగా కాపాడుకోవాలో ఆలోచిస్తున్నాం.. కానీ ఒక పనికి మాలిన పార్టీ ఉంది.. ఆ పార్టీ నేతల పొట్ట నిండా అబద్ధాలే. వారికి కల వచ్చిందంటా…అమ్మడానికి నేను ఒప్పుకున్నానంట. తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు. “విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” అని పోరాడి ఫ్యాక్టరీని సాధించుకున్నాం. నాడు ప్రైవేట్ పరం చేస్తామని ప్రతిపాదనలు వచ్చినప్పుడు నేను పోరాడి అడ్డుకున్నా. కేంద్రం నుండి ఆర్థిక సాయం కూడా తీసుకొచ్చాం. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునే బాధ్యత మాదే. అబద్ధాలు చెప్పే వారి మాటలు ఖండిస్తూ వాస్తవాలు చెప్పాలి. కరుడుగట్టిన ఆర్థిక ఉగ్రవాదులు విశాఖను దోచేశారు..వీళ్లను వదలిపెట్టను. ప్రజల మనోభావాలకు అనుగుణంగా పని చేస్తా.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

*జగన్ అనే భూతాన్ని భూ స్థాపితం చేయాల్సింది ప్రజలే
‘‘సూపర్-6 హామీలు కూడా త్వరలో అమలు చేస్తాం.. ప్రతి కుటుంబానికి అండగా ఉంటాం. 30 రోజులు కూడా కాలేదు.. అయినా చెప్పినమాట ప్రకారం పింఛన్ ను రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచాం. మూడు నెలల బకాయిలు కలిపి రూ.7 వేలు ఒకేసారి అందించాం. దేశంలోనే ఇదొక చారిత్రాత్మక ఘట్టం. మొదటి సంతకం డీఎస్సీపైనే పెట్టి 16,347 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపాం. మీ భూములు కొట్టేసేందుకు తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేశాం. 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి ప్రారంభించబోతున్నాం. పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం గత ప్రభుత్వానిది. పెట్టుబడిదారులతో మాట్లాడుతుంటే, మీ రాష్ట్రంలో భూతం ఉంది…అది లేస్తే ఏమవుతుందోనని అన్నారు. ఆ భూతానికి భూత వైద్యం చేసి శాశ్వతంగా భూ స్థాపితం చేసే బాధ్యత ప్రజలకే అప్పజెప్పామని వారితో చెప్పా. ఆ భూతాన్ని కంట్రోల్ చేసే వైద్యులు ప్రజలే.’’ అని అన్నారు.

కార్పెట్ కల్చర్ అధికారులు వీడాలి
‘‘ప్రజల ఆదాయం పెంచే మార్గం చూస్తాం. స్కిల్ గణన చేసి యువతలో నైపుణ్యం పెంచేందుకు శ్రీకారం చుట్టబోతున్నాం. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి అందిస్తున్నాం. నేను, పవన్ కళ్యాణ్, మోదీ చెప్పిన మాటలను ప్రజలు నమ్మి విశ్వసించారు. నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తాం. సచివాలయ సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు అందించాం…కానీ నాటి ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని చెప్పింది. పెంచిన పింఛన్లు ఇస్తూనే ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాం. మాపై అభిమానం అనే పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు.

ప్రజలు కూడా నేతలకు సహకరించాలి. మీ శ్రేయస్సే మా అభిమతం. నవ్వినా కొట్టే వ్యక్తి మొన్నటిదాకా పాలించారు. మీరంతా సంతోషంగా ఉండాలి.. మీ సంతోషం కోసం మేము పని చేస్తాం. గత ముఖ్యమంత్రి ఎక్కడికైనా వస్తే చెట్లు నరికి, పరదాలు కట్టి, షాపులు మూయించేవారు. ఇక్కడ అధికారులు కార్పెట్లు వేశారు.. ఇక్కడికి రాజులు రాలేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. ఈ కార్పెట్ కల్చర్ అధికారులు వదలాలి. అందరం మట్టిలోనే పుట్టాం.. చనిపోయినా మట్టిలోకే పోతాం. ఆడంబరాలు అవసరం లేదు.. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొస్తే చాలు. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తాం.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.