మాట నిలబెట్టుకునే పార్టీ మాది

– రుణమాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం
– ఆధార్ అప్‌డేట్ కానందుకే కొందరికి రుణమాఫీ కాలే
– మాజీ ఎంపి వి.హన్మంతరావు

మెదక్: కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు ఉందని, అందుకే ఇన్ని దశాబ్దాలు ప్రజల గుండెల్లో ఉందని మాజీ ఎంపి వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. రాహుల్-ప్రియాంక సమక్షంలో ఇచ్చిన రైతురుణమాఫీ అమలుచేసి, రైతులరుణం తీర్చుకున్నామన్నారు. ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేకున్నా, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు రుణమాఫీ చేశామన్నారు. రైతు కష్టాలు దేశంలో ఒక్క కాంగ్రెస్‌కే తెలుసునని వీహెచ్ మీడియా వద్ద వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా వి.హనుమంతరావు ఏమన్నారంటే.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కల్చర్ మాది. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపిస్తున్నాం. తొందరలోనే 6గ్యారంటీలను అమలు చేస్తాం. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోకపోవడం వల్లే కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు. కాంగ్రెస్ కార్యకర్తలు మాఫీ కాని అర్హులైన రైతులను గుర్తించి మాఫీ అయ్యేలా చూడాలి.

ఆగస్టు 15లోగా అందరికీ రెండు లక్షల రుణాలు మాఫీ చేస్తాం. ఆనాడు యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా ఉన్నప్పుడు రూ.70వేల కోట్లు మాఫీ చేసాం. కేసీఆర్ దళిత సీఎం అని చెప్పి ఎస్సీలను మోసం చేస్తే, మేము బట్టి విక్రమార్కను డిప్యూటీ ముఖ్యమంత్రిగా చేసి వారి ఆత్మ గౌరవాన్ని పెంచాం.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. మేము 7నెలల్లోనే ఉద్యోగాల భర్తీ మొదలుపెట్టాం. తెలంగాణ రైతులు ప్రతిపక్షాల మోసపూరిత మాటలు నమ్మవద్దు. కేంద్రంలో మోడీ కూడా రెండు కోట్ల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు. 25కోట్ల మందికి సహాయం చేశానని చెప్పుకుంటున్న మోడీ, ఎవరికి చేశారో బయటపెట్టాలి. ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ ఉక్కు, స్పెషల్ స్టేటస్ కోసం మేము కూడా పోరాడుతాం.