– ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేసాం :
– ఏదేని కారణాల వల్ల 2 లక్షలలోపు ఉన్న రుణం మాఫీ కానీ ఖాతాదారుల వివరాలు సేకరించి, పోర్టల్ లో అప్ లోడ్ చేసేందుకు వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ
– కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోపే 26,140.13 కోట్లు రైతు సంక్షేమానికి ఖర్చు పెట్టాం
– గత ప్రభుత్వం పెట్టిన రైతుబంధు బకాయిలు, డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీలు ఆయిల్ పాం రైతులు, కంపెనీలకు పెట్టిన బకాయిలు, పచ్చిరొట్ట విత్తనాల సబ్సిడీ బకాయిలు చెల్లించాం
– మాది చేతల ప్రభుత్వం, దిగజారుడు రాజకీయాలు మాకు రావు:
– తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్: రాష్ట్రంలోని 35 బ్యాంకులకు సంబంధించిన 3292 బ్రాంచులు మరియు 909 PACS ల నుండి 12 డిసెంబర్ 2018 నుండి 09 డిసెంబర్ 2023 వరకు తీసుకున్న పంటరుణాల వివరాలు తెప్పించడం జరిగింది. పాస్ బుక్ కలిగి వుండి రుణాలు పొందని ఖాతాల సంఖ్య 42 లక్షలు (ఆధార కార్డ్ నంబరు తప్పుగా నమోదైన ఖాతాలు, పంట రుణంలో అసలు కన్నా వడ్డీ ఎక్కువ వున్న ఖాతాలు తప్ప అన్నీ వివరాలు సరిగ్గా ఉన్నవి)రుణమాఫీ 2024 పథకం విధివిధానాలు, మార్గదర్శకాలతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి పంట కాలంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు G.O.Rt.No.567 విడుదల చేశాం. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన 3 రోజులకే అనగా జులై 18, 2024 నాడు, లక్షలోపు రుణాలున్న ఖాతాదారులు 11,50,193 కు 6098.93 కోట్లు విడుదల చేసి వారి రుణ విముక్తులను చేయడం జరిగింది.
రెండవ విడతలో లక్ష నుండి లక్షయాబై వేల వరకు రుణాలు ఉన్న 6,40,823 ఖాతాదారులకు 6190.01 కోట్లు విడుదల చేసి, వారిని రుణ విముక్తులను చేశాం. మూడవ విడుతలో అనగా ఆగస్టు 15, 2024 నాడు, ప్రభుత్వం ఇచ్చిన హామీలకు 2 లక్షలలోపు రుణాలు 4,46,832 ఖాతాలలో 5644.24 కోట్ల నిధులు విడుదల చేసి వారిని విముక్తులను చేసాం. మూడు విడతలలో మొత్తం 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేసి ఆగస్టు 15 లోగా 2 లక్షల వరకు రుణం ఉన్న రైతులందరిని రుణ విముక్తులను చేయడం జరిగింది.
రుణమాఫీ 2024 కు సంబంధించి రేషన్ కార్డు ప్రామాణికం కాదు అని పదేపదే చెప్పడం జరిగింది. కేవలం కుటుంబ నిర్ధారణకు మాత్రమే దానిని పరిగణలోనికి తీసుకున్నాము. 2 లక్షలలోపు రుణాలు ఉండి, రేషన్ కార్డు లేనివారు, ఆధార్ కార్డు వివరాలు తప్పుగా నమోదైనవారు మరే ఇతర కారణముతో రుణమాఫీ వర్తించని వారు వారికి దగ్గరలో ఉండే వ్యవసాయ అధికారిని సంప్రదిస్తే కారణం తెలుస్తుంది. దానిని బట్టి తగిన రికార్డులు సమర్పిస్తే వారికి కూడా త్వరలో రుణమాఫీ వర్తింపచేస్తాం.
ఇప్పటికే వ్యవసాయాధికారులందరికీ ఆదేశాలు జారీ చేశాం. మండల పరిధిలో ఉన్న అన్ని బ్యాంకు బ్రాంచులు / PACS లకు సంబంధించిన అన్ని సమస్యాత్మక ఖాతాలకు పూర్తి బాధ్యత ఆ మండల వ్యవసాయాధికారి తీసుకుంటారు.రైతు కుటుంబ నిర్ధారణ కోసం మండల వ్యవసాయాధికారి స్వయంగా రైతు కుటుంబాల దగ్గరికి వెళ్లి ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు మరియు ఆధార్ వివరాలు తీసుకుని పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు.
ఒకవేళ రుణఖాతాలో నమోదైన పేరు, ఆధార్ లో నమోదైన పేరుతో సరిపోలకపోతే ఖాతాదారుని దగ్గర సరైన వివరాలు సేకరించి పోర్టల్ లో అప్ లోడ్ చేస్తారు. ఒకవేళ బ్యాంకు సమర్పించిన అసలు మరియు వడ్డీలలో తేడా ఉన్నట్లయితే ఖాతాదారుడు వ్యవసాయాధికారికి తెలియజేయాలి.
ప్రతి జిల్లా వ్యవసాయాధికారి జిల్లా వ్యాప్తంగా రోజువారి అందిన ఫిర్యాదులను సాయంత్రం 5 గంటలలోపు డైరెక్టర్, వ్యవసాయ శాఖ కార్యాలయానికి పంపిస్తారు. అదేవిధంగా కొన్ని బ్యాంకుల నుండి సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70,000 నుండి 80,000 లోపు ఖాతాలకు సంబంధించి వివరాలు కూడా తెప్పించుకుంటున్నాము. (ఆధార్ నెంబర్లు సమర్పించకపోవడం, రుణాల మంజూరి తేదీలలో తప్పులు వంటివి) వీటిని పరిష్కరించడానికి రాష్ట్రస్థాయిలో అధికారుల బృందం చర్యలు తీసుకొంటున్నది.
మొదటి, రెండు విడతలలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి 44.95 కోట్లు నిధులు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వారు 2 లక్షల కంటే పైన తీసుకొన్న రుణఖాతాలకు సంబధించి అట్టి ఖాతాదారుడు 2 లక్షల పైన ఉన్న మొత్తాన్ని బ్యాంకులలో జమ చేసిన పిమ్మట వారికి కూడా 2 లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని వర్తింపచేయుటకు చర్యలు తీసుకొంటాం.
ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు రుణమాఫీని ఆగస్టు 15 కల్లా పూర్తిచేశాం.
రుణమాఫీ ప్రక్రియ పూర్తికాకముందే కొందరు రాజకీయ నాయకులు తొందరపడుతున్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోను ఇంతవరకు అధికారంలోకి వచ్చిన మొదటి పంటకాలంలోనే 31,000 కోట్ల నిధులు కేటాయించుకొని, దానిలో 2 లక్షల వరకు ఉన్న రుణాలను ఆగస్టు 15 వరకు పూర్తి చేసుకొని, 2 లక్షలకు పైన ఉన్న రుణాలను కూడా, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 2 లక్షల కంటే అధికంగా ఉన్న రుణం మొత్తాన్ని ఖాతాదారుడు జమచేసిన పిదప రైతులకు చెల్లించుటకు ప్రభుత్వం సిద్దపడుతుండగా, రైతులను అయోమయానికి గురిచేసే విధంగా ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించడం దురదృష్టకరం. ఒకవేళ నిజంగా రైతుసంక్షేమాన్ని కోరేవారయితే ముందుగా వారు గత పదిసంవత్సరాలలో చెల్లించకుండా, వదిలేసిన రుణాలు వివరాలు తెప్పించుకొని చెల్లించాల్సిందిగా సూచన చేస్తున్నాను.