– అధికారుల నిర్లక్ష్యంతో ముందుకు సాగని ఈ క్రాప్ బుకింగ్
– పెమ్మసాని ముందు ఏ కరువు పెట్టిన కౌలు రైతులు
– వారంలోగా ఈ క్రాప్ పూర్తి కావాలని అధికారులకు పెమ్మసాని ఆదేశాలు
గుంటూరు, మహానాడు: కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం. ఈ క్రాప్ బుకింగ్ పూర్తికానిచోట్ల వారంలోగా పనులు పూర్తి కావాలి. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలైన పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని వెంకటకృష్ణాపురం హాఫ్ పేట, అనుమర్లపూడి, తంగెళ్ళమూడి, శేకూరు, వీరనాయకునిపాలెం, సుందరయ్య కాలనీ, ముట్లూరు ప్రాంతాలలో పెమ్మసాని స్థానిక ప్రజా ప్రతినిధులు ధూళిపాల నరేంద్ర, బూర్ల రామాంజనేయులుతో కలిసి ఆదివారం పర్యటించారు.
ఈ సందర్భంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పెట్టుబడి, నష్టం తదితరు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వరద కారణంగా ఖరీఫ్ సీజన్ మొత్తం వృథాగా పోయిందని, కొన్ని సీజన్లలో సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని పొన్నూరు నియోజకవర్గ రైతులు పెమ్మసానికి వివరించారు. కాగా, గతంలో పనులు ప్రారంభమై ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ తో పాటు మరో నూతన ఎత్తిపోతల పథకం ప్రతిపాదనాలపై ఇరిగేషన్ అగ్రికల్చర్ అధికారులతో రైతుల సమక్షంలోనే పెమ్మసాని మాట్లాడారు. త్వరలోనే ఆ ఎత్తిపోతల పథకాల అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా రైతులతో పెమ్మసాని చెప్పారు.
ఈ క్రాప్ బుకింగ్ చేయలేదు
జగన్ ప్రభుత్వంలో కేవలం వైసీపీ నాయకులకు చెందిన పంటలను మాత్రమే ఈ క్రాప్ బుకింగ్ చేశారని, స్థానికంగా కొన్ని వేల ఎకరాలను ఈ క్రాప్ లోకి పొందుపరచలేదని పర్యటనలో భాగంగా పెమ్మసానికి పలువురు రైతులు విన్నవించుకున్నారు. దీంతో కేంద్ర సహాయ మంత్రి, ధూళిపాళ్ల అధికారులను పిలిచి వారంలోగా ఈక్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. రాబోయే సోమవారం ఒక అధికారిని పంచాయతీ కార్యాలయంలో నియమించి ఈక్రాప్ బుకింగ్ మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులు కవులు రైతులకు సమస్య రాకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. అనంతరం ప్రతిపాడు నియోజకవర్గంలోని ముట్లూరు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులుతో కలిసి పెమ్మసాని పరిశీలించారు. రైతులతో మాట్లాడి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
330 మందికి కిట్లు అందజేత
సీఎస్ఆర్ నిధుల కింద పెమ్మసాని నేతృత్వంలో ముందుకొచ్చిన ఇండస్ టవర్స్ లిమిటెడ్ సంస్థ, వరద ప్రభావిత ప్రాంతమైన సుందరయ్య కాలనీలో దుప్పట్లు చీరలు లుంగీలు టవల్స్ తో కూడిన ఒక్కో కిట్ చొప్పున 330 మందికి కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్, ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర, ఇండస్ టవర్స్ లిమిటెడ్ సీఈవో గంటా దిలీప్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను 4-5 రోజులుగా పర్యటిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మాని మరీ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని వివరించారు. వరద బాధితులకు సమయానికి పాలు అందుతున్నాయి అంటే అది ధూళిపాళ్ల వంటి నాయకుడు అందుబాటులో ఉండబట్టే సాధ్యమైందని అన్నారు. వరద బాధితులకు అవసరమైన దుస్తులు తదితర సంబంధిత కిడ్స్ అందజేస్తున్న ఇండస్ట్ టవర్స్ నిర్వాహకులకు ఈ సందర్భంగా పెమ్మసాని ధన్యవాదాలు తెలిపారు. అలాగే, పెదకాకాని మండలం సుందరయ్య కాలనీలో సి ఎస్ ఆర్ నిధుల కింద ఇండస్ టవర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దుస్తులు, దుప్పట్లు మంత్రి పెమ్మసాని పంపిణీ చేశారు.