Mahanaadu-Logo-PNG-Large

బొల్లా అవినీతి బాగోతాన్ని బయటపెడతాం

అవినీతిపై ఉన్న శ్రద్ధ…అభివృద్ధిపై లేదు
వినుకొండలో నేను చేసిన అభివృద్ధి కనిపిస్తోంది
ఐదేళ్లలో ఆయన ఏమైనా చేశారా?
టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు
నాగిరెడ్డిపల్లె డ్రైవర్స్‌ కాలనీలో మక్కెనతో ప్రచారం

వినుకొండ, మహానాడు : వినుకొండ నియోజకవర్గం మొత్తం ప్రతి గ్రామంలో తాను చేసిన అభివృద్ధికి సాక్ష్యాలున్నాయ ని, ఎక్కడకు వెళ్లినా సిమెంటు రహదారులే కనిపిస్తాయని టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. అదే సమయంలో ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యే బొల్లా చేసింది ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. సోమవారం వినుకొండ మండలం నాగిరెడ్డిపల్లె పంచాయతీ డ్రైవర్స్‌ కాలనీలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. అంతకు ముందు గ్రామస్థులు వారికి ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. స్థానిక వినాయక ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో 12 వేల మందికి ఇళ్లు ఇచ్చా మని, బొల్లా కనీసం 12 ఇళ్లు ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. 28 వేల మరుగు దొడ్లు ఇచ్చానని, బొల్లా ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.

ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందించేందుకు పల్నాడు వాటర్‌ గ్రిడ్‌ నిర్మాణానికి రూ.640 కోట్లు తెచ్చి పనులు కూడా ప్రారంభించినా వైసీపీ వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. పల్నాడు వాటర్‌ గ్రిడ్‌తో పాటు వినుకొండ శాశ్వత తాగునీటి పథకాన్ని కూడా నిలిపివేశారని మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించమని అడిగిన రైతును చెప్పుతో కొట్టిందే కాక జైలులో పెట్టించిన దుర్మార్గుడు బొల్లా అని ధ్వజమెత్తారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది రైతును చెప్పుతో కొట్టడానికా అని ప్రశ్నించారు. అతడికి ఎంతసేపు భూములు కబ్జా, ఇసుక, చీప్‌ లిక్కర్‌, రేషన్‌ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌తో వచ్చే ఆదాయంపై ఉన్న శ్రద్ధ పేద కష్టాలు, అవసరాలపై లేదని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వంలో పూర్తిస్థాయి విచారణ జరిపించి బొల్లా అవినీతి బాగోతా న్ని ప్రజలు, కోర్టు ముందు ఉంచుతామన్నారు. అవినీతి, బూతుల ఎమ్మెల్యేను చిత్తుచిత్తుగా ఓండిరచాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ బొల్లా అవినీతి, అరాచకాలను నియోజకవర్గ ప్రజలకు తెలియజేసి ఆయనను ఓడిరచడానికే తాను పార్టీ మారా ను తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. బొల్లా ఎన్నికల అఫిడవిట్‌లో చదువు విషయం లో తప్పుడు సమాచారం ఇచ్చారని, డిగ్రీ ధ్రువపత్రం నిజమైనదైతే తేల్చుకోవడానికి ముందుకు రావాలని సవాల్‌ చేశారు. జి.వి.ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపిస్తే వరికపూడిశెల ప్రాజెక్టు, పల్నాడు వాటర్‌ గ్రిడ్‌, వినుకొండ శాశ్వత తాగునీటి పథకంతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరింత సంక్షేమం అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నాగశ్రీను రాయల్‌, నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి యార్లగడ్డ లెనిన్‌, తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.