– ఎమ్మెల్యే గళ్ళ మాధవి
గుంటూరు, మహానాడు: కలియుగ ప్రత్యక్ష దేవుడు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా గోరంట్లలోని వెంకటేశ్వర స్వామి గుడిలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలకు సంఘీభావంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆధ్వర్యంలో టీడీపీ కార్యాలయం నుండి గోరంట్ల వరకు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత 5 ఏళ్లలో వైసిపీ చేసిన దుర్మార్గాలకు అంతే లేకుండా పోయింది. ఈ వైసీపీ కల్తీ నేతలు తిరుమల వెంకన్నను కూడా వదలలేదు. ప్రజలు వైసిపీ నేతలను అసహ్యించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొంది. తక్కువ ధరకు దొరుకుందని ఎన్నో కోట్లమంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ చేసిన విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు.
సిగ్గు లేకుండా, దేవుడి పట్ల భయం లేకుండా మాజీ అడ్వాకెట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మంగళవారం కూడా “పంది కొవ్వు 1200 రూపాయలు, నెయ్యి ౩౦౦కు లభిస్తున్నది. అంత విలువయిన పంది కొవ్వును ఎలా కలుపుతారు. రాగిలో ఎవరయినా బంగారం కలుపుతారా అంటూ మదమెక్కి మాట్లాడుతున్నారు. దీని వలన మత ఘర్షణలకు పురిగొల్పే విధంగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. అత్యంత సంపన్న దేవాలయం అయినా తిరుమలలో ఇలాంటి ఘటనలు శోచనీయం అని, తిరుమల పవిత్రతను కాపాడుకోవటం కోసం తిరుమలలో చంద్రబాబు నాయుడు యజ్ఞాన్ని, పవన్ కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలకు తెలుగుదేశం పార్టీ తరుపున సంఘీభావం తెలుపుతున్నామన్నారు.