• ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలి
• మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఆసక్తి ఉన్నవారికి శిక్షణ
• ఏడాదికి రూ.2643 కోట్లు సంపాదన… 2.45 లక్షల మందికి ఉపాధి
• మార్పు ఎక్కడో ఒక చోట మొదలవ్వాలి… నా ఆఫీసు, క్యాంపు కార్యాలయం, నా నియోజకవర్గం నుంచే మొదలుపెడదాం
• పంచాయతీలను గత పాలకులు నిర్వీర్యం చేశారు
• స్వయం సమృద్దిగా ఎదిగేలా పంచాయతీలను తీర్చిదిద్దుతాం
• పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో వ్యర్థాల నిర్వహణపై ప్రదర్శన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తాడేపల్లి: ‘పనికిరాదని పడేసే చెత్తతో కోట్ల రూపాయల సంపద సృష్టించవచ్చని, లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చ’ని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఘన వ్యర్థాలను 12 గంటల్లోపు సేకరించగలిగితే సంపద వస్తుంది… వ్యర్థాల నిర్వహణను శాస్త్రీయంగా చేపట్టాలి అన్నారు. ఒక్క గ్రామీణ ప్రాంతాల్లోనే ఏడాదికి రూ.2643 కోట్ల సంపద సృష్టించడంతోపాటు 2.42 లక్షల మందికి ఉపాధి కల్పించవచ్చని చెప్పారు.
వస్తువులు వినియోగించడం, విసిరేయడం తప్ప క్లీనింగ్ తో సంబంధం లేదనే భావన మనందరిలో ఉందని, ఆ భావన మార్చకపోతే భవిష్యత్తు తరాలకు తీరని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు అనుసరించాల్సిన విధానాలు, వాటి నుంచి ఎటువంటి ఉత్పత్తులు సాధించవచ్చు అనే అంశాలపై సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ (ఎస్.ఎల్.ఆర్.ఎం.) ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో గార్బేజ్ టూ గోల్డ్ పేరుతో శుక్రవారం ఉదయం తాడేపల్లిలోని పంచాయతీ రాజ్ కమిషనర్ కార్యాలయంలో ప్రదర్శన నిర్వహించారు.
ఈ ప్రదర్శనను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కన్నబాబు, ఎస్.ఎల్.ఆర్.ఎం. ప్రాజెక్ట్ డైరెక్టర్ సి.శ్రీనివాసన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “మన దైనందిక జీవితంలో చెత్త ఒక భాగమైపోయింది. దానిని మన జీవితాల నుంచి వేరు చేయలేం. ఇలాంటి ప్రదర్శనలు కొత్తేమీ కాదు. ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత ప్రయత్నం చేసి ఉంటాయి. మా ప్రభుత్వం హయాంలో మాత్రం బలంగా దీనిని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం.
పైలెట్ ప్రాజెక్టుగా పిఠాపురంలో ప్రారంభిస్తాం
మన దేశం సంసృతి, సంప్రదాయాలకు విలువిచ్చే దేశం. పంచభూతాలను దేవుళ్లుగా భావిస్తాం. చిన్నపాటి నీటి వనరు కనిపిస్తే గంగా జలంగా భావించి పూజలు చేస్తాం. దురదృష్టవశాత్తు మనమంతా పూజలు, పునస్కారాలకు మాత్రమే పరిమితమయ్యాం తప్ప జల వనరులను పరిశుభ్రంగా ఉంచడంలో విఫలమయ్యాం. భీమవరంలో యనమదుర్రు డ్రైన్ ను డంపింగ్ యార్డుగా మార్చేశారు.
వర్షాకాలంలో ఆ వ్యర్థాలు పంట కాలువలో కలిసిపోయి నీరు కలుషితమవుతోంది. ప్లాస్టిక్ కవర్లు రోడ్డు మీద ఇష్టానుసారం పడేయడం వల్ల వాటిని ఆహారం అనుకొని తప్పుగా భావించి పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఒకవైపు గోపూజ, గో రక్షణ అంటూనే వాటి మరణానికి మనం బాధ్యులు అవుతున్నాం.
ముందుగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభిస్తాం.
దానిలో వచ్చిన ఫలితాలను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ప్రణాళికలు రూపొందిస్తాం. సర్వీసు అంటే ఎవరూ ముందుకు రారు. చెత్తతో సంపద వస్తుంది అంటేనే ముందుకు వస్తారు. ఈ ప్రాజెక్టును పిఠాపురం నియోజకవర్గంలో విజయవంతంగా అమలు చేయడానికి మేము ఏమీ చేయాలో అన్నీ చేస్తాం. ఎవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తామని చెబితే వారి సాయం తీసుకుంటాం.
అవగాహన కల్పించడం చాలా అవసరం
ప్రాజెక్టును విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లాలంటే రోజుకు రెండుసార్లు చెత్తను సేకరించాలి. అంతకంటే ముందు దీనిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. అందుకు మాస్టర్ ట్రైనర్స్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. వాళ్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ ఇస్తాం. ముందుగా నా పార్టీ ఆఫీస్, క్యాంపు ఆఫీస్, నా నియోజకవర్గంలో నేను మొదలు పెడతాను. తరువాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం.
పంచాయతీల ద్వారా మోటివేషన్ తీసుకొస్తాం. ఇది చాలా కష్టమైనది, ఓపికతో కూడుకున్నది. దీనిని గనుక విజయవంతంగా చేయగలిగితే మాత్రం అద్భుతాలు సృష్టించవచ్చు. దీనిని 250 ఇళ్లు, ఒక సమూహంగానే కాకుండా ఒక కుటుంబం కూడా చేసుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా దీనిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజలంతా దీనిపై అవగాహన పెంచుకోవాలి. చెత్త ద్వారా వచ్చే సంపదను ఆయా కార్మికులకు కేటాయిస్తాం.
అన్ని అనర్థాలకు ఒక ఐ.ఏ.ఎస్. కారణం
పంచాయతీలను గత పాలకులు అనేక కారణాలతో నిర్వీర్యం చేశారు. బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. పంచాయతీలు సమూలంగా ప్రక్షాళన జరగాలి. స్వయం సమృద్దిగా పంచాయతీలు ఎదగేలా ఆలోచనలు చేస్తున్నాం. గ్రామాల్లో రోడ్లు వెంట కొబ్బరి చెట్లు పెంచడం ద్వారా కొంత ఆదాయం సమకూర్చుకునే ఆలోచన చేస్తున్నాం.
పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో ఏ సమీక్ష చేసినా అన్ని అనర్ధాలకు ఒక ఐఏఎస్ కారణం అని చెబుతున్నారు. ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు. ఎవరిని బాధ్యులను చేయాలి? నిధులు ఎలా రికవరీ చేయాలి? కేవలం కేసులుపెట్టి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి అంతే.
గ్రామీణ రోడ్లు కోసం మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు
గ్రామీణ రోడ్లపై జరిగిన సమీక్షలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ రిలీజ్ చేయకపోవడం మూలంగా మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. 30 శాతం నిధులు విడుదల చేసుంటే రోడ్ల నిర్మాణం అద్భుతంగా జరిగేది.
రకరకాల పేర్లు చెప్పి నిధులు దారిమళ్లించారు తప్పితే మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేకపోయారు. కొన్ని చోట్ల రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు. ఇలా అన్ని వ్యవస్థల్లో సవాళ్ళు ఉన్నాయి. ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తున్నామని” అన్నారు.
 
								