Mahanaadu-Logo-PNG-Large

అప్పుడు చట్టం… న్యాయం ఏమైంది జోగి రమేష్??

– గడచిన ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో అక్రమ అరెస్టులు ,అక్రమ కేసులు పెట్టారు
-తిరుపతి టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్

ఈరోజు సాయంత్రం తిరుపతి టిడిపి పార్లమెంట్ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో అధ్యక్షులు నరసింహ యాదవ్ మాట్లాడుతూ…

అధికారాన్ని అడ్డుపెట్టుకుని జోగి రమేష్ కుటుంబసభ్యులు చేసిన అక్రమాలు పుట్టలో నుంచి పాములు బయటకు వచ్చినట్లు ఒక్కోటి బయటకు వస్తున్నాయని విమర్శించారు.

అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన నిలబడతామని 2019కి ముందు ఊరూరా తిరిగి ఎన్నికల ప్రచారంలో చెప్పిన వైసీపీ నేతలు అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ భూములను స్వాహా చేశారని ఆరోపించారు.

అగ్రిగోల్డ్ భూముల అన్యాక్రాంతంపై అగ్రిగోల్డ్ యాజమాన్యం ఫిర్యాదుపై పోలీసు అధికారులు సుదీర్ఘ విచారణ తర్వాత చర్యలు తీసుకున్నారని తెలిపారు.

విజయవాడ రూరల్ లోని అంబాపురం గ్రామంలో అగ్రిగోల్డ్కు ఉన్న భూములు ఈడీ ఎటాచ్మెంట్లో ఉన్నాయి. జీవో నెం.117, తేదీ:14.08.2018 మరియు జీవో నెంబర్:133, తేదీ:17.10.2019న స్పష్టంగా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు..

విజయవాడ రూరల్లోని అంబాపురం గ్రామంలో సీఐడి ఎటాచ్మెంట్లో ఉన్న భూమిని జోగి రమేష్ కుమారుడు జోగి రాజు, రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పేర్ల మీద సర్వే నెం.88లోని 2160 చ.గ. భూమిని కొనుగోలు చేశారు (09.12.2022). కొనుగోలు చేసిన భూమి రికార్డులు తారుమారు చేసి సర్వే నెంబరు కూడా మార్చేశారని తెలిపారు.

సర్వే నెం.88లోని భూమిని కొని దానిని సర్వే నెం.87లోకి మార్చాలంటూ జోగి రమేష్ కుమారుడు రాజీవ్, వెంకటేశ్వరరావులు 29.04.2023న స్వీయ దిద్దుబాటు దస్తావేజులంటూ దరఖాస్తు చేసుకుని రికార్డులు కూడా మార్పించుకున్నారు. ఆ భూమిని తేది: 31.05.2023న పడిగిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారని యాదవ్ పేర్కొన్నారు.

ఈ భూమి వ్యవహారంలో అడుగడుగునా జోగి రమేష్ దుర్వినియోగానికి పాల్పడ్డాడు. గ్రామ సర్వేయర్ దేదీప్య ఎటువంటి సర్వే నిర్వహించకముందే సర్వే చేసినట్లు రికార్డులు కూడా ఆమె లాగిన్ ద్వారానే అప్లోడ్ చేసి సర్వే పూర్తి చేసినట్లు రికార్డులు సృష్టించారని యాదవ్ చెప్పారు.

సర్వే సమయంలో సరిహద్దు దారులైన అద్దేపల్లి కిరణ్, రాంబాబులకు నోటీసులు ఇచ్చి వాళ్లు కూడా నిర్ధారించినట్లు చెప్పారు. వాస్తవానికి వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. వారు నిర్ధారించలేదు, వారికి ఆ సర్వే నెంబర్ లో భూమి కూడా లేదని అన్నారు.

ఈ విధంగా అధికార దుర్వినియోగానికి పాల్పడి అగ్రిగోల్డ్ భూములను దక్కించుకోవడంతోపాటు సర్వే నెంబర్లు మార్చి విక్రయించారు. ఈ అక్రమాలపై అగ్రిగోల్డ్ సంస్థ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దర్యాప్తు జరిపి జోగి రాజును అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్యాలయం కార్యదర్శి చేజర్ల మనోహర్ ఆచారి, కార్యదర్శియశ్వంత్ రెడ్డి, మీడియా కోఆర్డినేటర్ చెంగయ్య, సురేష్, మురళి, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.