బీసీ డిక్లరేషన్‌ ఏమైంది రేవంత్‌?

-లక్ష కోట్ల బడ్జెట్‌ అమలు చేస్తున్నారా?
-రిజర్వేషన్లను 55 శాతానికి పెంచుతారా?
-సివిల్‌ కాంట్రాక్టులు, వైన్స్‌లో రిజర్వేషన్లు ఇస్తున్నారా?
-బీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు ప్రశ్నలు

హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీల కిచ్చిన హామీలు తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ మరచిపోయిందన్నారు. స్థానిక సంస్థల రాజకీయ రిజర్వేషన్లను 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నా ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జనాభా దామాషా ప్రకారం బీసీ లకు 55 శాతం రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాం డ్‌ చేశారు.

లక్ష కోట్ల బడ్జెట్‌ అమలు చేశారా?
బీసీ కుల గణనపై ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఇంతవరకు బీసీ కమిషన్‌కు ఈ దిశగా ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. బీసీల సబ్‌ప్లాన్‌ బడ్జెట్‌కు మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్దత తెస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో బీసీలకు బడ్జెట్లో లక్ష కోట్లు కేటాయిస్తామన్నారు. మొదటి బడ్జెట్‌లో కేటాయించింది నామమాత్రపు నిధులు మాత్రమేనని మండిపడ్డారు.

రైతులను అవమానించిన నేతపై చర్యలు తీసుకోవాలి
సివిల్‌ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి దాన్ని పాటిం చడం లేదు. వైన్స్‌లో గౌడ కులస్తులకు 23 శాతం రిజర్వేషన్ల ఊసే లేదు. మండలానికో బీసీ గురుకులం లేదు. అసలు ఏ శాఖకు ఏ మంత్రో తెలియడం లేదు. ఓ కాంగ్రెస్‌ నేత దొడ్డు వడ్లు పశువులే తింటాయని రైతులను అవమాన పరచాడు. తక్షణమే ఆ కాంగ్రెస్‌ నేత క్షమాపణ చెప్పాలని, సీఎం రేవంత్‌ రెడ్డి రైతులను అవమానపరిచిన ఆ నేతపై చర్యలు తీసుకోవాలని కోరారు. బీసీ డిక్లరేషన్‌ అమలుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.