Mahanaadu-Logo-PNG-Large

చట్టం చేస్తమన్నరు.. ఏమైంది?

-మెదక్‌ కోసం యుద్ధం చేద్దామా?
-రైతు బంధు రాలేదు
-బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

మెదక్: కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మెదక్‌ లో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఆయన మండి పడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చైతన్య వంతమైన మెదక్‌ నియోజక వర్గంలో మంచి తీర్పు ఇవ్వాలని కోరుతున్నా.. ఐదు నెలల కిందట తెలంగాణ ఎట్లా ఉండే.. ఎంత ఆగమాగమైతుంది మీరందరూ గమనిస్తున్నరు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారంటీలు అని అర చేతిలో వైకుంఠం చూపించి యావత్‌ తెలంగాణ ప్రజానికాన్ని దగా, మోసం చేసింది.

వాళ్లకు ఇష్టం వచ్చిన వాగ్ధానాలు చేశారు. ఏ వాగ్ధానం, హామీలు నెరవేర లేదు. ఒకటే ఒకటి ఉచిత బస్సు పెట్టారు. దాంతో మహిళలు కొట్టు కుంటున్నరు. ఆటో కార్మికులు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. రైతు బంధు అందరికీ వచ్చిందా? 9వ తారీఖు అన్నడు.. మళ్లీ ఎన్నికల అని పెట్టి దాన్ని ముంచే ప్రయత్నం చేస్తున్నరు’ అంటూ ధ్వజమెత్తారు..

‘మహిళలకు రూ. 2500 వచ్చినయట కదా? మొన్న ఇక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేనే కదా గెలిచింది. మరి రాలేదా? రూ. 15 వేలు వచ్చినయట కదా..? అంటే మోసమైందా? దగా అయ్యిందా? పాతవి కూడా వాళ్లు అమలు చేసే పరిస్థితి లేదు. రూ. లక్ష వరకు రుణ మాఫీ చేస్తానని రూ. 30 వేల కోట్లు రుణ మాఫీ చేశాం. ముఖ్యమంత్రి చెప్పిండు. రూ. 2 లక్షల రుణం తీసుకుంటే డిసెంబర్‌ 9న రుణ మాఫీ చేస్త అన్నడు. మరి మాఫీ జరిగిందా..? రైతు బంధు రాలేదు. ఏమీ రాలేదు. ఇలా 420 హామీలు.. ఆరు గ్యారంటీలు ఇచ్చారు.

ఎన్నికల్లో గెలువం గనే చట్టబద్ధం చేస్తాం. మీ అందరికీ ఇస్తామని ఏం చేయలేదు. చేయక పోగా బీఆర్‌ఎస్‌ గవర్నమెంట్‌ ఉన్న సమయం లోని స్కీమ్‌ లను సరిగా అమలు చేయడం లేదు. ముఖ్యమంత్రి జిల్లాలు తీసేస్తాని అని చెబుతున్నడు. దాంట్లో మెదక్‌ జిల్లా తీసేస్తా అంటున్నడు. జిల్లా ఉండాలంటే మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థిగా వెంకట్రామి రెడ్డి గెలవాలి. మెదక్‌ కోసం యుద్ధం చేద్దామా?’ అని ప్రశ్నించగా.. చేద్దామని జనం నినదించారు.

‘ఈ పాత జిల్లాలో పుట్టిన వాడిని కాబట్టి.. చాలా ప్రేమతో ఇక్కడ మెడికల్‌ కాలేజీ తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా రామాయంపేట డివిజన్‌ చేసుకున్నాం. మీరు కోరిన కోర్కెలు నెరవేర్చినం.. మీ మెదక్‌ వాళ్లకు బాగా తెలుసు. ఇదే కాంగ్రెస్‌, టీడీపీ రాజ్యంలో మొత్తం ఘనపురం ఎలా నాశనం చేశారో.. అందరూ బాధలు అనుభవించారు. దాదాపు రూ. 150 కోట్లతో ఘనపురం ఆనకట్టను బాగా చేసి.. ఎత్తు పెంచి బ్రహ్మాండంగా అందించాం. వంద పడకల ఆసుపత్రిని తెచ్చాం.

దాన్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ప్రభుత్వం 50 పడకలకు కుదించింది. ఏడుపాయల వన దుర్గ భవానీ జాతర ఘనంగా జరగాలని రూ. 100 కోట్లు మంజూరు చేశాం.. మెదక్‌ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 50 కోట్లు మంజూరు చేస్తే దాన్ని రద్దు చేశారు. రామాయంపేట మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేస్తే దాన్ని ముంచేసి వాపస్‌ తీసుకు పోతున్నరు. కొత్త హామీలు చేయక పోయినా పాత ప్రభుత్వంలో చేసిన మంజూరు వాటన్నింటిని ఈ రోజు రద్దు చేస్తున్నరు. మీరంతా గమనించాలి’ అని సూచించారు..