మీ అఫిడవిట్‌కు, ఆస్తులకు ఎందుకంత తేడా?

 -విడుదల రజనీకి పెమ్మసాని వరుస ప్రశ్నలు
 – భారీగా వాలంటీర్లు, వైసీపీ నేతల చేరిక

గుంటూరు: ‘ఆమె అంత జన హృదయ నేత అయితే చిలకలూరిపేట నుంచి మడమ ఎందుకు తిప్పారు? రిటర్నింగ్‌ అధికారికి ఆమె సమర్పించిన అఫిడవిట్‌కు, ఆస్తులకు ఏమైనా సంబంధం ఉందా?’ అని గుంటూరు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రశ్నించా రు. గుంటూరులోని స్థానిక 33వ డివిజన్లో సుమారు వాలంటీర్లతో సహా 180 కుటుంబాలు టీడీపీలో ఆదివారం చేరాయి. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పిన పెమ్మసానితో పాటు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఆహ్వానించారు. అనంతరం పెమ్మసాని మాట్లాడు తూ ప్రశాంత్‌, ఖాదర్‌, కిరణ్‌ ఆధ్వర్యంలో నేడు టీడీపీలో చేరుతున్న కార్యకర్తలకు ఆహ్వానం పలికారు. బటన్‌ నొక్కడడానికి సీఎంతో పని లేదని, ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఉన్నా సరిపోతుందని అంటూనే ముఖ్యమంత్రి అంటే అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి తెలిసి ఉండాలని జగన్‌ కు చురకలు అంటించారు. పక్కనే పారుతున్న నది, పుష్కలమైన రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నా సరే తాగడానికి నీళ్లు ఇవ్వలేని ఈ వైసీపీ నాయకులు ప్రజలను ఐదేళ్లుగా కష్టాలపాలు చేశారన్నారు. ఇల్లు దాటి బయటకు రాలేని జగన్‌కు ప్రజల కష్టాలు ఎలా అర్థమవుతాయని ప్రశ్నించారు.

మాధవి మాట్లాడుతూ ఒక్క ఛాన్స్‌ ఇచ్చిన పాపానికి ఆంధ్రప్రదేశ్‌ను జగన్‌ 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారని విమర్శించారు. పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. శాసనమండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌ మాట్లాడుతూ ఏపీ రాజధానిగా అమరావతి ఉంటుందని, అసెంబ్లీ సాక్షిగా జగన్‌ అంగీకరించారని, సీఎం అయ్యాక ఆ మాట మరిచి ప్రజలను మోసం చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌, మైనార్టీ నాయకులు సయ్యద్‌ ముజీబ్‌, కార్పొరేటర్‌ ఈరంటి హరిబాబు(బుజ్జి), డివిజన్‌ నాయకులు పేరయ్య తదితరులు పాల్గొన్నారు.