డిక్లరేషన్ ఇచ్చేందుకు జగన్‌కు బాధేమిటి?

– అది క్రైస్తవులైన బ్రిటిషర్లు ప్రవేశపెట్టిన విధానమే
– క్రైస్తవుడైన జగన్ క్రైస్తవులు చెప్పింది కూడా పాటించరా?

(ఆర్‌ఆర్‌ఆర్)

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పుణ్యాన.. తిరుమలలో అన్యమతస్తుల డిక్లరేషన్ వివాదాంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. అసలు ఈ డిక్లరేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిందే క్రైస్తవులయిన బ్రిటిషర్లు. వారు క్రైస్తవులయినప్పటికీ, తిరుమల దర్శనాలకు వెళ్లే ముస్లిం-క్రైస్తవులు డిక్లరేషన్ ఇవ్వాలని నిర్దేశించారు. ఇదంతా చరిత్రలో లిఖించి, గ్రంధస్తం చేసిందే. మరి అదే క్రైస్తవ మతానికి చెందిన క్రైస్తవ విశ్వాసి జగన్‌కు తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చేందుకు బాధేమిటి? భార్యతో కలసి తిరుమలకు వెళ్లేందుకు అభ్యంతరమేమిటి?

అసలు ఈ డిక్లరేషన్ విధానం.. దాని చరిత్ర ఏమిటో చూద్దాం.

తిరుమలలో డిక్లరేషన్ విధానం.. 1890 లో విలియం కెయిన్ అనే బ్రిటీష్ పొలిటీషియన్, బాప్టిస్ట్ క్రైస్తవుడు రాసిన పుస్తకం. పిక్చరెస్క్ ఇండియా దాని పేరు. ఇంగ్లడ్‌ నుండి భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చే బ్రిటీష్ టూరిస్టుల కోసం, రైల్వే రూట్లు, స్టేషన్లు, ఆ దారిలో ఉన్న దర్శనీయ స్థలాల గురించి, ఇంగ్లీషులో రాసిన 650 పేజీల పుస్తకం ఇది.

పుస్తకంలో రచయిత కెయిన్ పేజీ నంబర్ 488-489 లో తిరుపతి గురించి వివరిస్తూ 14,000 మంది జనాభా ఉండేవారని, యూరోపియన్లు తిరుమలను ‘అప్పర్ తిరుపతి’ అని పిలిచేవారని రాశాడు. తిరుమల దేవాలయంలోకి మహమ్మదీయుల్ని, క్రైస్తవుల్ని అనుమతించరని రాశాడు. ఒకవేళ దర్శించాలనుకుంటే తిరుపతి జిల్లా మేజిస్ట్రేటుకిగానీ, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టరుకిగానీ ముందే తెలియజేయాలని రాశాడు.

ఈ విషయం అతను చెబుతున్నది.. ఇంగ్లాండ్ నుండి వస్తున్న (క్రైస్తవ)యాత్రికులకు! అంటే తమ బ్రిటీష్ ప్రభుత్వ పాలనలోనే ఉన్న తిరుమలలో పాటించే మతపరమైన కట్టుబాట్లు, నియమాలు, ఆచారాలను ప్రస్తావిస్తూ.. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే ప్రొసీజర్ అనుసరించి వెళ్ళండి అని, ఒక బ్రిటీష్ క్రైస్తవుడే స్వయంగా చెబుతున్నాడు.

పైగా తిరుపతి జిల్లా మేజిస్ట్రేట్, నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ కూడా బ్రిటీష్ క్రైస్తవులే అయి ఉంటారు కదా? అయినా ప్రొసీజర్ ప్రకారం వారికి కబురు తెలియజేసి వెళ్ళమంటున్నాడు. నూటముప్పయి ఏళ్ళ కిందట, బ్రిటీష్ పాలనలోనే తిరుమల ఆచారాలను గౌరవిస్తే.. ఇప్పుడేం మాయరోగం వచ్చింది? అంతమాత్రం సహనం, సర్దుబాటు, పరస్పర గౌరవం ఇచ్చుకోలేనంత జబ్బేం చేసింది? ఎవరిని “టేకెన్ ఫర్ గ్రాంటెడ్” గా తీసుకుంటున్నారు? ఎందుకింత అధికార మదమెక్కింది? ఒకపక్క ఒక వర్గం మనోభావాలు దెబ్బతీస్తూ, ఇంకోపక్క మీ రాక్షస క్రీడని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నమే కదా?!