- మహిళా కమిషన్‌లో ఇంకా ‘గజ్జల’ మోత
- హోదా లేకపోయినా వెంకటలక్ష్మి హడావిడి
- మహిళా ‘చైరు’ పట్టుకుని వేళ్లాడుతున్న ‘పర్సన్’
- గత నెల లోనే ముగిసిన ఏపీ మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ పదవీకాలం
- అయినా ఛైర్‌పర్సన్ హోదాలోనే కొనసాగుతూ ఉత్తర్వులు ఇస్తున్న గజ్జల వెంకట లక్ష్మి
(సుబ్బు)
ఏపీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం మెంబర్ / ఛైర్‌పర్సన్ నియామకం అయిన తర్వాత, గరిష్టంగా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగగలరు. ఒకవేళ ఏదేని కారణం చేత మెంబర్/ఛైర్‌పర్సన్ రాజీనామా చేసినా లేక తొలగించ బడినా, వారి స్థానంలో తిరిగి ప్రభుత్వం నియమించే ఛైర్మన్ / మెంబర్, తాము ఏ సభ్యురాలి / ఛైర్‌పర్సన్ స్థానంలో నియమించబడ్డారో, వారికి మిగిలి ఉన్న కాలపరిమితితో మాత్రమే కొనసాగే అవకాశం ఉంది.
26-08-2019 లో, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గా బాధ్యతలు తీసుకొన్న వాసిరెడ్డి పద్మ, 25-08-2024 వరకు ఆ పదవిలో కొనసాగే అవకాశం ఉంది. . అయితే వాసిరెడ్డి పద్మ 04-03-2024 న రాజీనామా చేయగా, ఆమె స్థానంలో… ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉన్న గజ్జల వెంకట లక్ష్మి ని, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ గా నియమిస్తూ, 15-03-2024 న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ మహిళా కమిషన్ చట్టం ప్రకారం 25-08-2024 తో మహిళా కమీషన్ ఛైర్‌పర్సన్ పదవీకాలం ముగిసింది.
అయితే ఆమె ఇంకా కమిషన్ చైర్మన్ హోదాలోనే అధికారులకు ఆదేశాలివ్వడం, కేసులను తనంతట తాను సుమోటోగా తీసుకుని, హడావిడి చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఇటీవల బాలికల బాత్రూముల్లో రహస్య కెమెరాలు పెట్టారంటూ ఆరోపణలొచ్చిన ఇంజనీరింగ్ కాలేజీ వ్యవహారంలో, ఆమె అత్యుత్సాహం ప్రదర్శించడం చర్చనీయాంశమయింది.
తాను కాలేజీ సందర్శనకు వస్తున్నందున, తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశివ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అసలు ఆమె పదవీకాలం గత నెలలోనే ముగిసినప్పటికీ, ఇంకా పెత్తనం చేయడం ఏమిటి? పైగా వైసీపీ నాయకురాలి మాదిరిగా, ప్రభుత్వానికి వ్యతిరేక ప్రకటనలు ఇవ్వడం ఏమిటి? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
అటు ప్రభుత్వం కూడా ఈ విషయంలో నిర్లిప్తంగా ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవీకాలం ముగిసినవెంటనే, మరొకరిని నియమించడం గానీ, ఆమె స్థానంలో ఎవరినో ఒక అధికారికి బాధ్యతలు అప్పగించడం గానీ, ఆమె పదవీకాలం ముగిసిందన్న ప్రకటనగానీ.. కనీసం ఆ పదవి ఖాళీ అయిందన్న విషయం సీఎంకు తెలియపరచడంలో గానీ, సీఎంఓ అధికారులు విఫలమయ్యార న్న విమర్శలు వినిపిస్తున్నాయి.