కేసీఆర్.. ఎక్కడ?

– వరదసాయంలో కనిపించని వైనం
– తెలంగాణలో ఫాంహౌస్‌కే కేసీఆర్ పరిమితం
– హైదరాబాద్, ఖమ్మంలో మినహా కనిపించని గులాబీదళం
– అమెరికా నుంచి సర్కారు సాయంపై కేటీఆర్ విమర్శల ట్వీట్లు
– హాస్టళ్లలో హరీష్‌రావు పర్యటనలు
– వానలోనూ బాబు-రేవంత్ పర్యటనలు, పరామర్శలూ
– విపత్తులోనూ బయటకు రాని కేసీఆర్‌పై విమర్శలు
– ఆపన్నులకు సాయం బీఆర్‌ఎస్ సాయం చేయదా?
-సోషల్‌మీడియాలో తడిసిముద్దవుతున్న కేసీఆర్
( మార్తి సుబ్రహ్మణ్యం)

భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసిముద్దవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మూడురోజుల నుంచి నిర్విరామంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రెండు రాష్ట్రాల్లో దాదాపు 30 మంది మృతి చెందగా, గేదెలు, ఆవులు, కోళ్లు నేలరాలాయి. పశుసంపద దాదాపు నీటిపాలయింది. చెట్టు కూలి రోడ్లపై పడిపోయాయి. ఫలితంగా సామాన్య జనం రోడ్డునపడిన నేపథ్యంలో.. వారికి భరోసా ఇచ్చి సాయం చేసేందుకు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడయితే మూడురోజుల నుంచి కృష్ణాజిల్లా కలెక్టర్ క్యాంపు ఆఫీసునే సెక్రటేరియేట్‌గా మార్చేసి, అక్కడి నుంచి సమీక్షలు నిర్వహిస్తున్నారు. పడవల్లో బెజవాడ మొత్తం కలియతిరుగుతూ, మోకాలు లోతు నీటిలో పర్యటిస్తున్నారు. ఇక బాగా నష్టపోయిన ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సైతం క్షేత్రస్థాయి పర్యటనలు చే సి, బాధితులకు మేమున్నామని భరోసా ఇస్తున్నారు. ఇళ్లలోకి వెళ్లి బాధితుల బాధలు విన్నారు. ఆ విధంగా ఏపీ-తెలంగాణ సీఎంలు.. జలంలో చిక్కుకున్న జనాల మధ్యనే ఉంటూ వారిలో ధైర్యం నూరిపోస్తున్నారు.

ఈ నేపథ్యంలో పదేళ్లు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. ఎక్కడా కనిపించకపోవడంపై అటు రాజకీయ వర్గాలు, ఇటు సోషల్‌మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. తెలంగాణను పదేళ్లు కంటితో శాసించిన మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఈ క్లిష్ట సమయంలో జనంలోకి రాకపోవడంపై అటు సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. వర్ష ప్రభావం ఉన్న జిల్లాల్లో సీఎం రేవంత్‌రెడ్డి సహా, మంత్రులంతా క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు. అయితే హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలంతా వర్షాల్లో రోడ్లపై తిరుగుతూ, చురుకుగా వ్యవహరిస్తుండగా, ఖమ్మంలో ఎంపి వద్దిరాజు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇక మిగిలిన వారంతా రోజూ పత్రికా ప్రకటనలు, ప్రెస్‌మీట్లు పెట్టి సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకే పరిమితమవుతున్నారు. సీనియర్ నేత హరీష్‌రావు హాస్టళ్లను సందర్శిస్తుండగా, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా పర్యటనలో బిజీగా ఉంటూ, రేవంత్ సర్కారు వైఫల్యాలపై ట్వీట్లకు పరిమితమవుతున్నారు.

ఏపీలో ప్రతిపక్షనేత జగన్ రెండురోజులు ఆలస్యమైనప్పటికీ, మూడవరోజున విజయవాడలో ముంపు ప్రాంతాల్లో దిగి బాధితులను పరామర్శించారు. వామపక్షనేతలు సైతం వాననీటిలో దిగి బాధితులను పరామర్శిస్తున్నారు. కానీ తెలంగాణలో పదేళ్లు సీఎంగా చేసి, విపక్షనేతగా ఉన్న కేసీఆర్ మాత్రం, ఫాంహౌస్ నుంచి కాలుబయటపెట్టకపోవడం విమర్శలను దారితీసింది. ఇలాంటి క్లిష్ట సమయంలో కేసీఆర్ జనంలోకి వస్తే, అటు పార్టీకి సైతం మంచిపేరు వస్తుందని పార్టీ నేతలే చెబుతున్నారు.

పోనీ పార్టీపరంగా కూడా.. బాధితులకు ఇప్పటిదాకా సాయం చేయకపోవడంపైనా, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సహజంగా ఇలాంటి విపత్తులో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, తమ నిధుల నుంచి బియ్యం, ఉప్పు, పప్పు, నూనె, మంచినీళ్ల బాటిళ్లు, పాలు, అగ్గిపెట్టెల వంటి నిత్యావసర వస్తువులు బాధితులకు స్వయంగా అందిస్తుంటాయి. అధికారికంగా వందల కోట్ల బ్యాంకు బ్యాలెన్సు ఉన్న బీఆర్‌ఎస్, ఇప్పటిదాకా అలాంటి సహాయ చర్యలు చేపట్టకపోవడంపై, సొంత పార్టీలోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిజానికి నిధులకు కొరత లేని బీఆర్‌ఎస్ తలచుకుంటే ఒక జిల్లాలో ప్రజలందరికీ ఒకరోజు నిత్యావసర వస్తువులందించే సత్తా ఉందని గుర్తు చేస్తున్నారు. ఇటీవలి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా దేశంలోనే అత్యధిక నిధులున్న పార్టీగా బీఆర్ ఎస్ రికార్డు సృష్టించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

చివరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, బాధితులకు బాసటగా తమ నెల జీతం కూడా ప్రకటించకపోవడమే ఆశ్చర్యం. అటు సీఎం రేవంత్‌రెడ్డి సైతం ‘లక్ష కోట్ల ఆస్తులున్న కేసీఆర్ కుటుంబం, బాధితుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు వెయ్యి కోట్లు ఎందుకివ్వదు’ అని ప్రశ్నించడం ప్రస్తావనార్హం.

కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రాకుండా.. తన పార్టీ నేతలతో ప్రభుత్వ సాయంపై విమర్శలు చేయించడాన్ని తటస్తులు, మేధావులు కూడా స్వాగతించలేకపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఏ ప్రభుత్వం ఉన్నా.. తన పరిమితుల మేరకే సాయం చే స్తుందని, రాజకీయ పార్టీలు- స్వచ్చంద సంస్థలు- పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలతోనే ఏ ప్రభుత్వమైనా, ఇలాంటి విపత్తు సమయంలో ముందడుగు వేస్తుంటుందని గుర్తు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో ప్రభుత్వానికి సాయం చేసేబదులు.. హైదరాబాద్, అమెరికాలో కూర్చుని విమర్శలు చేయటం వల్ల అధికారులతోపాటు, బాధితుల ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుందని విశ్లేషిస్తున్నారు. ఎక్కడో అమెరికాలో ఉన్న కేటీఆర్ కూడా టీట్లతో ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని, మంత్రి సీతక్క ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.
‘ లక్షకోట్లు సంపాదించిన మీ కుటుంబం ఎప్పుడైనా నీళ్లలో దిగి, బాధితులను ఆదుకుందా? మేం ఇక్కడ ప్రజాక్షేత్రలో పనిచేసి బాధితులకు భరోసా కల్పిస్తుంటే అభినందించాల్సిన మీరు, అమెరికాలో ఉండి ట్వీట్లలో విమర్శిస్తున్నారు. మీకేమైనా సిగ్గుందా’ అంటూ సీతక్క విరుచుకుపడ్డ వైనం చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి క్లిష్ట సమయంలో అభినందించి, సాయం చేయకపోయినా, పనికట్టుకుని చేసే విమర్శలను ఎవరూ స్వాగతించరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘సహాయ చర్యలో అధికారుల అవినీతిని విమర్శిస్తే తప్పు లేదు. కానీ అసలు సహాయ చర్యలే జరగడం లేదని విమర్శిస్తే ఎవరూ హర్షించరు. అది బురదరాజకీయమవుతుంద’న్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.