కాదేదీ రాజకీయానికనర్హత అన్నట్టుగా….తిరుమల యాత్రికులు పరమ పవిత్రం గా భావించుకునే లడ్డూ ప్రసాదం కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసింది . ఎప్పుడు అందులోనుంచి బయటకు వస్తుందో ఎవరికీ తెలియదు . తెలిసిన వారు ఒక్కరే ఉన్నారు. ఆయనే ….సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు . కానీ , వారు చెప్పలేరు కదా ! అందువల్ల ; ఈ “లడ్డూ రాజకీయం ” …అసెంబ్లీ వచ్చే ఎన్నికల నాటి వరకూ నిరాఘాటంగా కొనసాగినా …. కొనసాగవచ్చు .
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతం లో అనేక సార్లు చెప్పారు , ” సంక్షోభాలను అవకాశాలు గా మలుచుకుని , ముందరకు వెడతాను …” అని . పాలిటిక్స్ లో అది ఆయన స్పెషలైజేషన్ కూడా . సంక్షోభాలు ఎదురైతేనే ….ఆయన పాలనా సామర్థ్యం జనానికి తెలుస్తుంది . ఇదిగో తాజా ఉదాహరణ .మొన్న , బెజవాడ లో వరదలు వచ్చాయి . ఇళ్ళు , వాకిళ్ళు…ఏకం పాకం అయిపోయాయి . బెజవాడ అంతా బుడమేరై పోయింది .
దీనిని చంద్రబాబు ఓ అద్భుత అవకాశం గా మార్చుకున్నారు . ముఖ్యమంత్రి అయి ఉండీ,మోకాలు లోతు నీళ్ళల్లో తిరిగారు . సెల్ ఫోన్ టార్చ్ వెలుగుల్లో అర్ధ రాత్రిళ్ళు సైతం తిరిగారు . రబ్బరు పడవుల్లో ….వరద బాధితుల మధ్య నీళ్ళ ప్రవాహాల్లో తిరిగారు . అలా తిరగక పోతే , ఆయనకు నిద్రపట్టదు .
మొత్తం వరద బాధిత ప్రాంతాలను పదిరోజుల్లోనే ఒక కొలిక్కి తెచ్చారు . వరద బాధిత సమయం మొత్తం విజయవాడ కలెక్టరేట్ లోనే ఉన్నారు. సొంత నివాసానికి వెళ్ళలేదు .
ఇది అనే కాదు . ఏ సంక్షోభం వచ్చినా ఆయన శైలి అంతే! అంత సీరియస్ నెస్ తో పని చేస్తారు . విశాఖపట్నం లో హుద్ హుద్ తుపాను వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ….వైజాగ్ వెళ్లి , బస్సు లోనే విశ్రమించారు ; పరిస్థితులు మళ్ళీ సాధారణ స్థితికి వచ్చాయనే భావన కలిగే వరకు .
ఎక్కడోచోట సంక్షోభం ఎదురవ్వక పోతే …ఆయనకు పిచ్చెత్తిపోతుందా అన్నట్టుగా నూరు శాతం దృష్టి పెట్టి , ఆ సంక్షోభాన్ని ఆయన అవకాశంగా మార్చుకుంటారు . ఇప్పుడు “తిరుపతి లడ్డు ” వంతు వచ్చింది. నిజానికి ఇది తిరుపతి దేముడు ….ఆయన భక్తులకు సంబంధించిన అంశం.
చంద్రబాబు జూన్ 12 ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే ; జూన్ 15 నే తిరుపతికి ఓ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ ను నియమించారు . ‘ రెడ్డి లాటి పొలిటికల్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు . 100 శాతం అడ్మినిస్ట్రేటివ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ . 1997 బ్యాచ్ కి చెందిన జె.శ్యామలరావు. జస్ట్… యాన్ ఆఫీసర్ ఆఫ్ రూల్స్ . వచ్చిన రోజు నుంచి కొండమీద వంకర్లు ….వంకర్లు గా మెలికలు తిరిగివున్న అనేక ఆచార వ్యవహారాలను , పద్ధతులను సరి చేసే పనిలో శ్యామలరావు పడ్డారు. డౌన్ టు ఎర్త్ ఆఫీసర్.
ఈ స్వామి వారి లడ్డూల నాణ్యత వ్యవహారం ఆయన చూసుకునే వారు . అవసరమైతే , పోలీసు ఫిర్యాదో…. విజిలెన్స్ దర్యాప్తో….ఆయన చూసుకునేవారు . గాడి తప్పిన వాటిని …తిరిగి గాడిలో పెట్టి ఉండేవారు. కానీ , భక్తుల మనోభావాలను తీవ్రం గా ప్రభావితం చేయడానికి అవకాశం ఉన్న ఈ ఆకృత్యాన్ని అల్లరల్లరి చేశారు . ఈ ఘటన ను చంద్రబాబు హ్యాండిల్ చేసిన తీరు చూస్తే ; సరియైన సలహాదారుల ఆయన తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నట్లు కనపడుతున్నది .
జగన్ కూడా సరిగ్గా ఇటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నారా అన్నట్టుగా …. చంద్రబాబు విసిరిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు . ఆయనకు నమ్మకం లేని తిరుమలకు వెడుతున్నట్టు ప్రకటించారు. దీంతో , కొండమీద నెలకొని ఉన్న ప్రశాంతమైన ” ఆధ్యాత్మిక వాతావరణం ” రొచ్చు రొచ్చు …రోత రోత” గా తయారవుతుంది . జగన్ కు కావలసింది ఇదే. పేషంట్ కు కావలసిన మందే డాక్టర్ గారు రాశారు అన్నట్టు అయింది .
ఈ ఘటన నుంచి టీడీపీ , చంద్రబాబు నాయుడు ఎక్కడ రాజకీయ లబ్ధి పొందుతారోనన్న కంగారు లో ….పవన్ కళ్యాణ్ గబ గబా రెండడుగులు ముందుకు వేశారు . ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ కనకదుర్గ గుడి మెట్లు కడిగారు. “ప్రాయశ్చిత్త” దీక్షలు చేశారు. విశేషం ఏమిటంటే – ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన హిందువులకు మాత్రమే కాదు ….సర్వ మత విశ్వాసాల ప్రజలకూ ప్రతినిధి .
ఆయన అసలు క్యూబా దేశ విప్లవకారుడు చేగువేరా కు స్వయం ప్రకటిత ప్రతినిధిని అని చెప్పుకునేవారు . ఇప్పుడూ చిన జీయర్ స్వామి అవతారం ఎత్తినట్టు కనిపిస్తున్నారు .
అలా కనిపించడానికి , ప్రవచనాలు ప్రచారం చేయడానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండాల్సిన పని లేదు . ధర్మ పరిరక్షణ ప్రచారం లో ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు కూడా .
కాకపోతే , ప్రభుత్వం లో నుంచి బయటకు వచ్చి , పూర్తి స్థాయి స్వామీజీ గా ఆయన ప్రజలలో ధర్మ ప్రబోధనలు చేసుకుంటూ తిరిగితే ; హిందూ మతానికి , ధర్మ పరిరక్షణకు ఆది శంకరాచార్యుల వారు చేసినంత సేవ చేసినవారు అవుతారు .
అటు ముఖ్యమంత్రి , ఇటు ఉప ముఖ్యమంత్రి ….తిరుపతి లడ్డూ లో ఉన్న కల్తీ పై చేయాల్సినంత అల్లరి చేసిన తరువాత ; కల్తీ కి సంబంధించిన అన్ని కోణాలు వెలుగు లోకి తీసుకు రావడానికి ఒక దర్యాప్తు బృందాన్ని (సిట్)నియమించారు .
సిట్ లోని ఐపిఎస్ అధికారులు ముగ్గురూ …ఒక్క సాక్షి మీడియా తప్ప , మిగిలిన వారెవ్వరూ పేరు పెట్టడానికి వీలే లేని ఐపిఎస్ అధికారులు . అందువల్ల , స్వామి వారి భక్తులకు కొంత ఉపశమనం .
అయితే ;
1.ఎన్ని రోజులు / నెలల్లో సిట్ దర్యాప్తు ముగింపుకు వస్తుంది .
2.దర్యాప్తు నివేదిక ను సిట్ ఏం జేస్తుంది ?
3.ముఖ్యమంత్రికి ఇచ్చి చేతులు దులిపేసుకుంటుందా ?
4.దర్యాప్తు నివేదిక ఎవరు ప్రజలకు వెల్లడిస్తారు ? ఈ ఓ శ్యామలరావా, ముఖ్యమంత్రి బాబు గారా ? సిట్ చీఫ్ సర్వ శ్రేష్ఠ త్రిపాటీ నా ?
5.బాధ్యులపై కేసులు నమోదు చేస్తుందా ? 6. ఈ మొత్తం లో ఈఓ శ్యామల రావు పాత్ర ఏమిటి ?
7.దానితో లడ్డూ వివాదం ఓ కొలిక్కి వస్తుందా ?
8.ఇప్పుడు లడ్డూల్లో నెంబర్ 1 నెయ్యి వాడుతున్నారనుకుంటే ; ఈ వివాదం అంతా “అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు మోగించడం ” లాటిది .
ఈ ప్రహసనాన్ని వీలైనంత త్వరగా ముగించడం టీటీడీ కి , ప్రభుత్వానికి, చంద్రబాబు కీ , పవన్ కళ్యాణ్ కీ కూడా మంచిది . ఇప్పుడు చాలా పెద్ద సమస్యగా కనపడుతున్న ఈ అంశం ; ఓ నెలా …,రెండు నెలలు పోయేసరికి దూది పింజలా గాలికి ఎగిరిపోయేంత చిన్న అంశం గా కనపడుతుంది . చంద్రబాబు , కళ్యాణ్ బాబు చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి.
ప్రభుత్వం ….రాజకీయాలు అన్న తరువాత ఏదో ఒక సంక్షోభం రాకపోదు కదా ! అందువల్ల , ఈ ” సంక్షోభం” నుంచి అవకాశం సృష్టించుకోక పోతే ఎలా అనే ఆందోళన కు పోకుండా ….చంద్రబాబు ముందరకు వెళ్ళాలి .
మొత్తం మీద “లడ్డూ దెబ్బ ” తో టీటీడీ బోర్డు సభ్యుల నియామకం వెనక్కు పోయినట్టే ! అది కూడా చంద్రబాబు కు ఓ అవకాశమే కదా !