-రాష్ట్రాన్ని కాపాడుకునే ఆక్సిజన్ ఎన్డీఏ కూటమి
-డబుల్ ఇంజిన్ సర్కారుతో.. రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం
-2047 నాటికి వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం
-ప్రతి సారీ ఒక డ్రామాతో వచ్చి ప్రజల్ని దగా చేస్తున్నాడు
-మొన్న తండ్రి మరణం, నిన్న బాబాయి బాత్రూం మర్డర్, ఇప్పుడు గులకరాయి
-రాష్ట్ర భవిష్యత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు
-మోదీ నాయకత్వంలో దేశం, ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్లబోతోంది
-సంపద సృష్టించడం, దాన్ని ప్రజలకు పంచడమే మా ధ్యేయం
-పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం కోసం పని చేస్తున్నాం
-కష్టపడే ప్రతి కార్యకర్తనూ ఆదుకునే బాద్యత కూటమి తీసుకుంటుంది
-దగా చేసిన జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమికొట్టాల్సిందే
-అనకాపల్లి ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు
అనకాపల్లి : రాష్ట్ర భవిష్యత్తుకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఇది చూశాక తాడేపల్లి ప్యాలెస్ లో ఎన్ని టీవీలు పగిలాయో. కళకళలాడుతున్న మన సభలు చూసి జగన్ రెడ్డికి పిచ్చి పెరిగిపోయి ఉంటుంది. మూడు పార్టీలు ఎందుకు కలిశాయో అమిత్ షా, నరేంద్ర మోదీ స్పష్టంగా చెప్పారు. సైకో పోవాలి.. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలనే లక్ష్యంతో ఏ త్యాగానికైనా సిద్ధమని పవన్ కల్యాణ్ ప్రతిపాదించారు. అలాంటి పవన్ కల్యాణ్ విశాఖకు వస్తే ఆటంకాలు సృష్టించి, అడ్డుకుని, విశాఖలో అడుగు పెట్టనీయలేదు. విశాఖ ఏమైనా జగన్ రెడ్డి తాత జాగీరా? ఎన్నో అవమానాలు, అవహేళనలు ఎంతగానో భరించారు.అయినా తట్టుకుని నిలబడ్డారు. సినిమాల్లోనే కాదు.. ప్రజా జీవితంలోనూ హీరోగా నిలిచారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తాం. అధికార మదంతో విర్రవీగిన ఈ సైకోని రాష్ట్రం నుండి తరిమికొడదాం. నరేంద్ర మోదీ పదేళ్లు ప్రధానిగా ఉండి ఆర్ధిక వ్యవస్థను ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపొందించారు. గెలిచాక మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిపేందుకు సంకల్పం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ అనే విజన్ రూపొందించుకున్నారు. అదే సమయంలో మన రాష్ట్రం కోసం కూడా విజన్ రూపొందించాం. వికసిత్ ఆంధ్ర ప్రదేశ్ అనేది నా కల.
నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ముందుకు పోవాలి. ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ కావాలి. భారత దేశంలో ఏపీ ప్రజలు నెంబర్ వన్ కావాలనేది నా విజన్. పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం మా కల. అందుకే ఈ కూటమి. కేంద్రంలో మోడీ గ్యారెంటీ, ఏపీలో సూపర్ సిక్స్ ఉన్నాయి. తాజాగా మనం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో చూసి ఈ సైకోకి మతిపోయింది. 25 పార్లమెంట్లు మనమే గెలుస్తున్నాం. 160కి పైగా అసెంబ్లీ సీట్లు మనం గెలుస్తున్నాం. సైకోని ఇంటికి పంపిస్తున్నాం.
2019కి ముందు జగన్ రెడ్డి పాదయాత్రలో నెత్తిన చెయ్యి పెట్టి, బుగ్గలు నిమరి, ముద్దులు పెట్టాడు. అధికారంలోక వచ్చాక బాదుడే బాదుడు. గుద్దుడే గుద్దుడు. శుక్రవారం సాయంత్రానికి జేసీబీ తెచ్చి ఎవరో ఒకరి ఇళ్లు కూల్చారు. పోలీసుల్ని గోడలు దూకించి అరెస్టులు చేయించాడు. మా కలయిక గూండాగిరిని అణచివేయడానికి, అమరావతి నిర్మాణం చేయడానికి, పోలవరం పూర్తి చేయడానికి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయడానికి ,అవినీతి ప్రభుత్వాన్ని అంతం చేయడానికి, తెలుగు భాషను, దేవాలయాలను కాపాడడం కోసమే మా కూటమి ఏర్పడింది.
జగన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ప్రజల ఆస్తులు కొట్టేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రజలకు తాతలు, తండ్రుల నుండి వచ్చిన ఆస్తులపై నీ ఫోటోలేంటి? నా భూమి పత్రాలపై ఈ సైకో ఫోటో పెట్టుకోవాలా? పోస్టల్ బ్యాలెట్లలో ఉద్యోగులు జగన్ రెడ్డికి దుమ్ము దులిపేశారు. అవినీతితో సంపాదించిన సొమ్ముతో ఓట్లు కొనాలని ప్రయత్నించిన వారికి ఉద్యోగులు చుక్కలు చూపించారు. ఈ సైకో జగన్ పని అయిపోయింది. ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది. అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెంచుతాం. ప్రతి ఒక్క ఎన్డీఏ నాయకుడు మోదీ గ్యారెంటీ, కూటమి హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
2019 కి ముందు తన తండ్రిని, చిన్నాన్నను ఎవరో చంపేశారు అంటూ మాపై నిందేలశారు. అధికారంలోకి వచ్చాక నిందలేసిన వారికే పదవులిచ్చాడు. నిందితులకు కొమ్ము కాస్తున్నాడు. హూ కిల్డ్ బాబాయ్ అనేది ప్రజలందరికీ అర్ధమైంది. ఈ జగ్గూ బాయ్ కి అర్ధం కావడం లేదు. గతంలో బాబాయిని గొడ్డలితో చంపాడు. మరోసారి గెలిస్తే.. ప్రతి ఇంటికీ గొడ్డలి తీసుకొస్తాడు.
నాకు విశాఖ నగరమంటే ఎంతో ఇష్టం. ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా ఉండే జిల్లా ఇది. హుదూద్ వస్తే పది రోజుల పాటు ఇక్కడే బస్సులో కూర్చుని పనులన్నీ చక్కదిద్దాను. విశాఖను కోలుకున్న తర్వాతే బయల్దేరాను. ఆ కృతజ్ఞత మొన్నటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. మంచి చేసిన వారిని మరచిపోని ప్రజలున్నారు. హుదూద్ సమయంలోనే దీపావళి వచ్చింది. చెట్లు ఎండిపోయాయి. దీపావళి చేసుకోవద్దు, ప్రమాదం నివారించుకుందామని చెబితే మాటపై నిలబడ్డారు. అలాంటి విశాఖను జగన్ రెడ్డి భ్రష్టు పట్టించాడు. రెండేళ్లలో భోగాపురం విమానాశ్రయం పూర్తి చేసేలా మేము పనులు చేపట్టాం. జగన్ రెడ్డి వచ్చి మళ్లీ శంకుస్థాపన చేశాడు తప్ప ఐదేళ్లలోపనులు పూర్తి చేయలేదు.
నరేంద్ర మోదీ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ బాటలో రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో నడిపిస్తాం. ప్రపంచం మొత్తంలో తెలుగువారు ఐటీలో దూసుకుపోవడానికి నా వంతు బాధ్యతగా నిలిచాను. ఇప్పుడు కూడా అదే విధంగా సంపద సృష్టించి, దాన్ని పేదలకు పంచిపెడతాను. ఆడబిడ్డ నిధితో ప్రతి ఒక్కరికీ రూ.1500 చొప్పున అందిస్తాం. పిల్లలు మన ఆస్తి. వారికి అండగా నిలవడమే లక్ష్యంగా తల్లికి వందనంతో ప్రతి విద్యార్ధికీ రూ.15 వేలు ఇస్తాం.
మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాను. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాను. మహిళల్ని ఆర్ధికంగా స్థిరపడేలా చేయాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33శాతం కల్పిస్తామని తెలిపారు. గతంలో డ్వాక్రాతో ఆర్ధికంగా పొదుపు ఉద్యమం నేర్పించాం. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళల సత్తా చూస్తే గర్వంగా ఉంటుంది. కాలేజీ సీట్లు, ఉద్యోగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశానిది.
యువతకు ఉద్యోగాలు పేరుతో జగన్ రెడ్డి దగా చేశాడు. జాబ్ క్యాలెండర్ అని చెవిలో పువ్వు పెట్టాడు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తా. అంత వరకు 3 వేల నిరుద్యోగ భృతి కల్పిస్తాను. తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతాను. పెట్టుబడులు తెచ్చి, పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పిస్తాను. కూటమితో అడుగేయండి. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శ్రమించండి. రైతులకు ఏటా రూ.20 వేలు ఆర్ధిక సాయం అందిస్తాం. రెండు ఎన్నికల మేనిఫెస్టోలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాం.
ఉత్తరాంధ్ర అంటే బీసీలకు కంచుకోట.తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లు. ఉత్తరాంధ్రను కూటమి క్లీన్ స్వీప్ చేయడం తధ్యం. ఉత్తరాంధ్ర ద్రోహులు ఈ జగన్ రెడ్డి. గతంలో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.2500 కోట్లు ఖర్చు చేస్తే.. జగన్ రెడ్డి ఖర్చు చేసింది రూ.500 కోట్లు మాత్రమే. మనం అధికారంలో ఉండి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పోలవరం, నదుల అనుసంధానం పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరిచ్చే అవకాశం ఉండేది.మొన్నటి వరకు విజయసాయిరెడ్డి, ఇప్పుడు సుబ్బారెడ్డి ఉత్తరాంధ్రపై పెత్తనం చేస్తున్నాడు. కానీ మేము ఎర్రన్నాయుడు, బండారు సత్యన్నారాయణ మూర్తి, అయ్యన్న పాత్రుడు, గంటా లాంటి వారిని ప్రోత్సహించాం. కావలి ప్రతిభా భారతిని ఏకంగా స్పీకర్ గా చేసుకున్నాం. జగన్ రెడ్డికి ఉత్తరాంధ్ర భూములపైనే ప్రేమ తప్ప.. ఉత్తరాంధ్రపై ఏమాత్రం కూడా లేదు.
రూ.200 పెన్షన్ రూ.2000 చేశాం. కానీ, ఈ సైకో అంటున్నాడు రూ.1000 నుండి రూ.3000 చేశాడని. సిగ్గుండాలి అలా చెప్పుకోడానికి. ఈ రోజు హామీ ఇస్తున్నా.. ప్రతి పెన్షన్ దారుడికీ అధికారంలోకి రాగానే రూ.4000 పెన్షన్ ఏప్రిల్ నెల నుండే అమలు చేస్తాను. ఎప్పుడో ఐదేళ్ల తర్వాత రూ.250 పెంచుతానంటున్నాడు. ఇలాంటి పేదల ద్రోహిని క్షమిస్తామా?
రేపు జరిగే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటం. ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి మధ్య పోరాటం, విధ్వంసానికి అభివృద్ధికి మద్య పోరాటం. కల్లోల ఆంధ్రప్రదేశ్ కి కలల ఆంధ్రప్రదేశ్ కి మధ్య పోరాటం. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ప్రగతి కూటమితోనే సాధ్యం. హలో ఏపీ.. వైసీపీ అని ప్రజలు ఫిక్స్ అయిపోయారు.
అనకాపల్లి ఎంపీగా సి.ఎం.రమేష్‌ను గెలిపించుకుందాం. నాలెడ్జి ఉంది, పరిచయాలున్నాయి. ఇలాంటి వారు ఢిల్లీలో ఉంటే సమస్యలు పరిష్కరిస్తారు. పెట్టుబడులు తెస్తారు. కేంద్రం నుండి నిధులూ తెస్తారు. సి.ఎం.రమేష్ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేవు. మెజార్టీ ఎంతో తేల్చాల్సిన సమయం వచ్చింది. అరకు పార్లమెంటు అభ్యర్ధిగా పోటీ చేస్తున్న వంగా గీతను గెలిపించుకుందాం. అరకు కాఫీ బ్రాండ్‌ని ప్రపంచ వ్యాప్తం చేద్దాం. విశాఖపట్నం ఎంపీగా ఎం.శ్రీభరత్‌ని గెలిపించుకుందాం. ఇతను కూడా జగన్ రెడ్డి అరాచకానికి బాధితుడే.
శుక్రవారం శుక్రవారం వచ్చి యూనివర్శిటీ గోడలు కూల్చారు. ఎవరేం చేసినా వెనక్కి తగ్గనని ముందుకు వెళ్లారు. అటానమస్ యూనివర్శిటీ అయిన గీతంపై నిందలేసి, కూల్చేయాలని ప్రయత్నించడానికి సిగ్గుండాలి. ఇలాంటి అభ్యర్ధుల్ని గెలిపించుకున్నపుడే మనకు కావాల్సిన పనులు జరుగుతాయి. సాధారణ కార్యకర్తగా ఉన్న వ్యక్తిని విజయనగరం ఎంపీ అభ్యర్ధిగా కలిశెట్టి అప్పలనాయుడిని నిలబెట్టాం. గెలిపించాల్సింది మీరే. ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్ధిగా ఈశ్వరరావును గెలిపించుకుందాం. మన గంటా శ్రీనివాసరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇతని గెలుపు ఫిక్స్. మెజార్టీ ఎంతనేదే మా ఆలోచన.
పెందుర్తి నుండి జనసేన అభ్యర్ధిగా పంచకర్ల రమేష్, యలమంచిలి నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్ధి విజయ్ కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్ధిగా విష్ణుకుమార్ రాజును గెలిపించుకోవాలి. ప్రజా సమస్యల కోసం మిత్రపక్షంలోనూ ప్రతిపక్షంలా నిలిచి పోరాడిన ప్రజా నాయకుడిని గెలిపించుకోవాలి. నిఖార్సైన నాయకుడు, పార్టీ ఆవిర్భావం నుండి జెండా మార్చకుండా పార్టీ కోసం సైనికుడిలా పని చేస్తూ, అరుదైన నాయకుడిలా గుర్తింపు తెచ్చుకున్న మన అయ్యన్న పాత్రుడి గెలుపు ఎలా ఉండాలో మీరే నిర్ణయించుకోవాలి. ఎన్నో కేసులు, వేధింపులు అయినా తగ్గేదే లే అంటూ పోరాడారు.
42 సంవత్సరాలుగా చూస్తున్నా.. న్యాయం, ధర్మం కోసం అయ్యన్న ప్రజా జీవితం ప్రజలకే అంకితం. ఇలాంటి నాయకుడిని గెలిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. మాడుగుల నుండి బండారు సత్యనారాయణ బరిలో నిలుస్తున్నారు. పొత్తులో సీటు పోయినా.. ఆయన నిస్వార్ధ సేవల్ని గౌరవించుకోవడమే లక్ష్యంగా సీటిచ్చాం. ఎన్నో తప్పుడు కేసులు, ఎంతో వేధింపులు అయినా ఎక్కడా తొణకలేదు. బెణకని నాయకుడు మన బండారు సత్యన్నారాయణను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. ఛోడవరం నుండి కె.ఎస్.ఎన్.ఎస్ రాజును అఖండ మెజార్టీతో గెలిపించుకుందాం.
టీడీపీ ఫైర్ బ్రాండ్, రాజీలేని పోరాట యోధురాలు వంగలపూడి అనిత పాయకరావుపేట నుండి గెలిపించుకోవాలి. సీనియర్ నాయకుడు, జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ అనకాపల్లి నుండి గెలిపించుకుందాం. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్ధిగా గణబాబును గెలిపించి హ్యాట్రిక్ కొట్టాలి. విశాఖ తూర్పు నుండి పోటీ చేస్తున్న ప్రజా సేవకుడు, ప్రజల మనిషి వెలగపూడి రామకృష్ణ బాబును మరోసారి గెలిపించుకుందాం. కూటమిలో భాగంగా కొంత మంది సీనియర్ నాయకులకు సీట్లు రాలేదు. అయినా అందరూ ఏకమై పని చేయాలి.