జగన్‌ తిరమలకొస్తానంటే ఆంక్షలా?

– ప్రతి నెయ్యి ట్యాంకర్‌ నుంచి శాంపిల్‌ తీసుకుంటున్నారా?
– రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం జరుగుతోందా?
– ఈఓకు దమ్యుంటే ఎన్‌డీడీబీ రిపోర్టులు బయటపెట్టాలి
– తిరుపతిలో మీడియతో మాట్లాడిన టీటీడీ మాజీ ఛైర్మన్, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి

తిరుపతి: తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు దుష్ప్రచారం బెడిసి కొట్టడంతో, జగన్‌ తిరుమల పర్యటనను కూడా కూటమి నాయకులు రాజకీయాలకు వాడుకుంటున్నారని వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. డిక్లరేషన్‌ పేరుతో కూటమి పార్టీలు చేస్తున్న హంగామా చూస్తుంటే వీరంతా అసలు హిందువులేనా అనే అనుమానం కలుగుతోందన్న ఆయన, హైందవ సంస్కృతిలో ఇలా ఆలయాలకు రాకుండా అడ్డుకోవడం ఉంటుందా? అని ప్రశ్నించారు.

జగన్‌ తిరుమల పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు తిరుపతి వెళ్తున్న పార్టీ నాయకులందరినీ రాయలసీమ వ్యాప్తంగా పోలీస్‌ యాక్ట్‌–30 పేరుతో నోటీసులిచ్చి, హౌస్‌ అరెస్టులు చేయడాన్ని భూమన తప్పుబట్టారు. సాధారణ భక్తుడిగా జగన్‌ దేవదేవుని దర్శనానికి వస్తుంటే వీరంతా ఎందుకంత వణికిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. తమ పార్టీకి ఆలయాల్లో ప్రవేశం లేనట్లు, తాము దేవున్ని దర్శనం చేసుకోవడం తప్పు అన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు.

తిరుపతిలో కొత్తగా బీజేపీలో చేరిన కొందరు నాయకులు సర్టిఫికెట్‌ ఇస్తే, వారే హిందువులు అన్నట్టుగా ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నారని టీటీడీ మాజీ ఛైర్మన్‌ దుయ్యబట్టారు. 40 శాతానికిపైగా ప్రజల మద్దతు పొందిన నాయకుడిని హిందూత్వం, సనాతన ధర్మం పేరుతో కట్టడి చేయాలని చూడటం దారుణమని అభివర్ణించారు.

సీఎంగా అయిదేళ్లు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వం తరపున సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించిన జగన్‌ని, ఇప్పుడు డిక్లరేషన్‌ అడగడం సిగ్గుచేటని టీటీడీ మాజీ ఛైర్మన్‌ అన్నారు. నాడు సుదీర్ధ పాదయాత్ర ముగిసిన వెంటనే, తిరుపతి నుంచి కాలి నడకన తిరుమల చేరుకున్న వైయస్‌ జగన్, తిరునామంతో సంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్న విషయం మరిచిపోయారా అని భూమన ప్రశ్నించారు.

గంగా నది పుష్కరాల్లో అయ్యవార్ల సమక్షంలో సంప్రదాయబద్దంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. గతంలో వైయస్సార్‌ కూడా సీఎంగా, 5ఏళ్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని, పదులసార్లు సంప్రదాయ బద్దంగా స్వామివారిని దర్శించుకున్నారని, తాను కూడా పాదయాత్ర ప్రజాప్రస్థానం ముగిసిన వెంటనే తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించారు.

గతంలో ఎంజీ గోపాల్‌ టీటీడీ ఈఓగా ఉన్నప్పుడు, జగన్‌ స్వామివారి దర్శనానికి వస్తే, ఆయన నుంచి డిక్లరేషన్‌ తీసుకున్నారా? అని అడిగితే.. సంప్రదాయ దుస్తులు ధరించి తిరునామంతో భక్తిశ్రద్ధలతో స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా డిక్లరేషన్‌ ఇవ్వాలా? అని ఆయన సమాధానమిచ్చారని తెలిపారు.

తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ సీఎం చంద్రబాబు రాద్దాంతం చేసిన అంశాన్ని ప్రస్తావించిన భూమన కరుణాకర్‌రెడ్డి.. గత రెండు నెలలుగా తిరుమలకు వచ్చిన ప్రతి నెయ్యి ట్యాంకర్‌ శాంపిల్‌ పరీక్ష కోసం పంపారా? అని టీడీడీ ఈఓ శ్యామలరావును ప్రశ్నించారు. అలా పంపిస్తే ఎన్‌డీడీబీ రిపోర్టు వచ్చిందా? అని ఆరా తీసిన ఆయన, వెంటనే అవన్నీ బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.