– లా అండ్ ఆర్డర్ లేదు
– 45 రోజుల పాలనలో ఏకంగా 36 రాజకీయ హత్యలు
– 24న ఢిల్లీలో ఆందోళన
– ఏపీ హింసను ఢిల్లీ దృష్టికి తీసుకువెళ్లాం
– వినుకొండలో మాజీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్ రెడ్డి.
వినుకొండ : రాష్ట్రంలో ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతోంది. గత 45 రోజులగా రాష్ట్రంలో పరిస్థితి గురించి ఏ సామాన్యుడిని అడిగినా.. ప్రతి సామాన్యుడి నోటిలోంటి వచ్చే మాట ఒక్కటే.. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని వస్తుంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు అయితే వాళ్లు ఎవరినైనా వెళ్లి కొట్టొచ్చు. ఎవరినైనా హత్య చేయవచ్చు. ఎవరి ఆస్తులనైనా ధ్వంసం చేయవచ్చు. ఎవరిమీద అయినా హత్యాప్రయత్నం చేయవచ్చు.
వాళ్లు ఏం చేసినా పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తారు. అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే.. పోలీసులు దొంగ కేసులు బనాయిస్తారు.
రాష్ట్రంలో ఒక నీచ సంస్కృతి రాజ్యమేలుతుంది.
చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాను. ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 36 రాజకీయ హత్యలు జరిగాయి. 300 కి పైగా హత్యాయత్నాలు జరిగాయి.తెలుగుదేశం పార్టీ వాళ్ల వేధింపులు భరించలేక…. 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు.
560 చోట్ల ప్రయివేటు ఆస్తులను ధ్వంసం చేశారు. ఇళ్లల్లో చొరబడి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు. షాపులు కాల్చివేస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల చీనీ చెట్లను నరికివేస్తున్నారు.
490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవికాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు చేశారు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనడానికి నిదర్శం ఈ రషీద్ కేసే. ఇదే వినుకొండకు గతంలో ఎస్పీగా రవిశంకర్ రెడ్డి ఉన్నాడు. మంచి అధికారి. ఎన్నికల వేళ వీళ్లకున్న పలుకుబడితో ఆ అధికారిని తప్పించారు.
తర్వాత వీళ్లకు కావాల్సిన బిందుమాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. బిందు మాధవ్ అనే ఎస్పీ ఎంత అన్యాయస్తుడంటే… ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికాగార్గ్ అనే మంచి ఆధికారిని పెట్టింది.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ని కూడా పంపించారు. ఆ అఫీసర్ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు మనుషులకి సహాయసహకారాలు అందించరు అని చెప్పి పంపించారు. ఆ ఆఫీసర్ వెళ్లిపోయిన రోజు కొత్త ఎస్పీగా శ్రీనివాస్ అని వీళ్లకు సంబంధించిన అధికారిని తెచ్చుకున్నారు.
కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే రషీద్ హత్య జరిగింది. అది కూడా అత్యంత దారుణంగా నడిరోడ్డమీద ప్రజలందరూ చూస్తూ ఉండగా… అమాయకుడైన వ్యక్తి, ఒక సాధారణ ఉద్యోగస్తుడుగా వైన్‌షాపులో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని అతి కిరాతకంగా నడిరోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కత్తితో నరికి చంపారు.
అలా నరుకుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులందరిని నరుకుతానని మెసేజ్ పంపించేందుకు ఈ హత్య చేశారు. పోలీసు వ్యవస్ధ వీళ్లదే.. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళందరూ పత్రికల ముసుగులో ఏ స్ధాయికి దిగజారిపోయారో గమనించండి. ఈనాడులో అప్పుడెప్పుడో మోటర్ బైక్ కాలిందని… ఈ బైక్ జిలానీదేనని… కాల్చింది వైయస్సార్సీపీ వాళ్లేనని.. అందుకే రెండేళ్ల తర్వాత ఈ హత్య జరిగిందని దారుణంగా అబద్దాలు చెబుతున్నారు.ఇవి పత్రికాలా? టీవీలా? వీళ్లు చేస్తున్న దుష్ప్రచారం, అబద్దాలకు సిగ్గుతో తలవంచుకోవాలి.
చంద్రబాబు ఆటవిక పాలనకు నిరసనగా బుధవారం ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. రాష్ట్రంలో 45 రోజుల్లో క్షీణించిన శాంతిభద్రతల అంశాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకు వెళ్తాం. అసెంబ్లీలో కూడా నిలదీస్తాం. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ, హోంమంత్రి శ్రీ అమిత్‌షా అపాయింట్‌మెంట్లుకూడా కోరాం. అనుమతి రాగానే రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులను వారికి వివరిస్తాం.