విజయవాడ, మహానాడు: యాదవుల కష్టసుఖాల్లో అండగా ఉంటానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు నమ్మి భానుప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో భవానిపురంలోని ఓ ఫంక్షన్ హాలులో ఆదివారం యాదవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుజనా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
యాదవులు విశ్వాసానికి మారుపేరని, వారిని ఆర్థికంగా ఉన్నత స్థానాని కి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకం అందరికీ అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి మౌలిక వసతుల ప్రాధాన్యమే ధ్యేయంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. యాదవ సామాజిక వర్గీయులను అన్ని విధాలుగా అండగా ఉంటానని, ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా దీవించి కమలం గుర్తుకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సుజనాకు యాదవులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు, ఒంగోలు టీడీపీ పార్లమెంట్ పరిశీల కులు నూకసాని బాలాజీ, ఓబీసీ జాతీయ అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఎలగల నూకానమ్మ, కోరాడ ఫౌండేషన్ అధినేత కోరాడ విజయ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, యాదవ సంఘం ప్రతినిధులు రవికృష్ణ కాకు, మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు