సత్తెనపల్లి అభివృద్ధికి సేవకుడిలా పనిచేస్తా

-టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
-చివరిరోజు ముమ్మర ప్రచారం

సత్తెనపల్లి, మహానాడు: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం ఆలోచించి ఓటేయాలని టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మీలో ఒక్కడిగా మీ వెంట నడుస్తూ మిమ్మల్ని నడిపించే వాడిని. ఓటేసి గెలిపిస్తే సేవకుడిలా పనిచేసి సత్తెనపల్లి దశ, దిశ మారుస్తానని కోరారు. శనివారం సత్తెనపల్లి పట్టణంలో చివరిరోజు జోరుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేనేంటో 35 ఏళ్లుగా మీకు తెలుసు. మీ ఇంట్లో ఒకరిగా ఎంతో ఆదరణ చూపించారు. మీ కుటుంబసభ్యుడిలా నన్ను ఆదరించారు. మీ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా. అందరం కలిసి గత ఐదేళ్లుగా అభివృద్ధికి దూరమైన సత్తెనపల్లిని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణం తో మన పిల్లల భవిష్యత్తును మార్చుకుందాం.. సంక్షేమ పథకాలతో పేదరికాన్ని రూపుమాపుదాం. సోమవారం జరిగే పోలింగ్‌లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.