– పరీక్షలో విద్యార్థి జవాబుకు టీచర్ ఫిదా
(వెంకటాచారి)
పదికి పది మార్కులు ఎందుకేశారంటే.. No Mobile.. No Life.. ప్రస్తుతం మొబైల్ అనేది ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి చేతి లోనూ మొబైల్ కనిపిస్తోంది. స్మార్ట్ ఫోన్ అనేది ఓ వ్యసనంగా మారి పోయింది. స్మార్ట్ ఫోన్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ఆధునిక జీవితంలో స్మార్ట్ ఫోన్ యొక్క ప్రాముఖ్యం గురించి పరీక్షలో ఓ విద్యార్థి తనదైన శైలిలో విశ్లేషించాడు. మొబైల్ లేకపోతే జీవితమే లేదని తేల్చాడు. అతడి అనాలిసిస్ నచ్చడంతో టీచర్ ఏకంగా పదికి పది మార్కులు వేశారు.
ఆ వైరల్ పోస్ట్ ప్రకారం..ప్రశ్నాపత్రంలో మొబైల్ వినియోగానికి సంబంధించి ప్రశ్నలు అడిగారు. దానికి ఆ కుర్రాడు రక రకాల విశ్లేషణలు చేసి చివరకు మొబైల్ లేనిదే జీవితంలో లేదని తేల్చాడు.
“మొబైల్ లేకపోతే మూడ్ బాగోదు.. మూడ్ బాగో లేకపోతే.. చదువు రాదు.. చదువు కోకపోతే ఉద్యోగం రాదు.. ఉద్యోగం లేకపోతే డబ్బు రాదు.. డబ్బు లేకుండా ఆహారం లభించదు.. ఆహారం లేకపోతే అంద వికారంగా మారుతాం.. అప్పుడు ఎవరూ ప్రేమించరు.. పెళ్లి కూడా చేసుకోరు.. అప్పుడు, ఒంటరిగా ఉండి డిప్రెషన్ లోకి వెళ్లి పోతాం.. డిప్రెషన్ లోకి వెళితే అనారోగ్యానికి గురై చని పోతాం..” అని రాశాడు. చివర కంక్లూజన్ ఇస్తూ, `నో మొబైల్.. నో లైఫ్` అని రాశాడు.
ఈ జవాబు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఈ వీడియోను 2.4 కోట్లకు పైగా వీక్షించారు. 4.8 లక్షల మంది లైక్ చేసారు. ఈ పోస్ట్‌పై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. ఆ టీచర్ కూడా మొబైల్‌కు అడిక్ట్ అయినట్టున్నారు. అందుకే పదికి పది మార్కులు వేశారు. “ఇదే ఆధునిక జీవితం”, “చాలా ప్రాక్టికల్ అనాలిసిస్”, “ఇదే చేదు నిజం” అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.