– ప్రతి సెక్టార్ లోని అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలి
– భక్తుల మనోభావాలను గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలగాలి
– ఎన్టీఆర్ జిల్లా జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ: ఈనెల మూడవ తేదీ నుంచి జరిగే దసరా ఉత్సవాలను విజయవంతం చేసేందుకు వివిధ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో, నిబద్ధతతో పని చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సూచించారు.బుధవారం నగరంలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో దసరా ఉత్సవాలకు సంబంధించి బాధ్యతలు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఈనెల 15వ తేదీ వరకు భవాని దీక్ష విరమణ వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు-2024 జరగనున్న నేపథ్యంలో ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అధికార బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీనియర్ అధికారులు, సిబ్బందిని ఈ బృందాల్లో భాగస్వాములను చేసినట్లు వివరించారు.
26 సెక్టార్లలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం ఒంటిగంట నుంచి రాత్రి 9 గంటల వరకు, రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు మూడు షిఫ్టుల్లో బృందాలను నియమించినట్లు తెలిపారు. జిల్లా అధికారులతో పాటు పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎండోమెంట్, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక తదితర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాల్లో ఉంటారని వివరించారు.
డ్యూటీ పాయింట్ల వద్ద అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. భక్తుల మనోభావాలకు గౌరవిస్తూ క్రమశిక్షణతో పనిచేయాలని పేర్కొన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రతి భక్తుడూ సులువుగా అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని.. అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషిస్తూ ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ సృజన సూచించారు.
కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్. ఎం.ధ్యానచంద్ర, విజయవాడ ఆర్డీవో కె.చైతన్య, డీఆర్వో వి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.