గుంటూరు ఛానల్ అభివృద్ధికి కృషి

– కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు, మహానాడు: గుంటూరు ఛానల్ అభివృద్ధి అందరి కల… రాబోయే జనవరి నుంచి పూడికలు తీయించి నిర్వహణ బాధ్యత తీసుకుంటాం.. నల్లమడ డ్రైన్, గుంటూరు నల్ల సమస్యను పరిష్కరించి, గుర్రపు డెక్క రాకుండా శాశ్వత పరిష్కారం ఎలా అందించాలన్న అంశంపై అధికారులతో నిరంతరంగా పరిశీలిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అందులో భాగంగానే ఖర్చులు, నిధుల నిమిత్తం నాబార్డ్ అధికారులతో సంప్రదింపులు జరిపాం. గత ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పుల వల్ల ప్రస్తుతం ఎక్కువ నిధులు సేకరించడానికి ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినా సరే ఏదో ఒక రూపేనా నిధులు సేకరించి సమస్యలు పరిష్కరించి, అభివృద్ధి చేస్తామని చెబుతున్నానన్నారు.

ప్రతిపాడు నియోజకవర్గ చెరుకూరు మండలంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని, మాట్లాడారు. మీ అందరి ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పటి రోజుల గుర్తుకు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో చెప్పిన కబుర్లు విని.. విని ప్రజలు విసిగిపోయి ఉన్నారు. నేను చేయబోయేదే చెబుతాను. జరగబోయే నిజం మాత్రమే చెబుతాను. అబద్దాలు చెప్పాల్సిన పనిలేదు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 2,800 కోట్లు మన రాష్ట్రానికి మంజూరయ్యాయి. వాటిలో పార్లమెంట్ లోని ఒక్కో గ్రామానికి రూ.60 లక్షలు మంజూరు చేయించుకోగలిగాం. నా తరపున కూడా ఎన్నో రోడ్లు మంజూరు చేయించాం. పలు సాంకేతిక కారణాల వల్ల ఆగిన రోడ్లను కూడా మంజూరు చేయించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు వేయిస్తాం. గుంటూరు పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గంలోనూ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నాం.

నియోజకవర్గంలో కొన్ని భూములు ఉన్నాయని ఎమ్మెల్యే రామాంజనేయులు గుర్తించారు. అవకాశాన్ని బట్టి ఏఏ పరిశ్రమలు వస్తే ప్రజలకు ఉపయోగపడతాయో చూసి, తగు నిర్ణయం తీసుకుంటాం. నా సొంత నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన స్కూళ్ళను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేయడంలో భాగంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కూడా నిర్మింపజేస్తాను. వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నాయకులు, కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకు అవసరమయ్యే న్యాయపరమైన ఖర్చులను కూడా నేను చూసుకుంటాను. రామాంజనేయులు కలిసి వస్తానని చెప్పారు. ఇద్దరం కలిసి కేసుల సమస్యలను పరిష్కరిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాపై నమ్మకం ఉంచి అందించిన కేంద్ర సహాయ మంత్రి బాధ్యతను నిర్వహిస్తూనే, నిరంతరం మీ అందరికీ అందుబాటులో ఉంటాను.

ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, వందనాదేవి, వట్టిచెరుకూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు మన్నవ పూర్ణచంద్రరావు, సర్పంచ్ ఆరుమల్ల విజయ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఏదుబాటి శివయ్య, నియోజకవర్గ యువజన నాయకుడు నాగిశెట్టి నాగరాజు, వట్టిచెరుకూరు మండల జనసేన కన్వీనర్ పత్తి భవన్నారాయణ, టి.ఎన్.ఎస్.ఎఫ్ జిల్లా అధ్యక్షులు మన్నవ వంశీ తదితరులు పాల్గొన్నారు.