బ్యాలెట్‌ ఓటింగ్‌ దగ్గర వైసీపీ మూకలు

– నిబంధనలకు విరుద్ధంగా బూత్‌లలోకి ప్రవేశం
– వారి అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం
– ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాం
– టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ

నరసరావుపేట, మహానాడు : వైసీపీ వెన్నులో వణుకు మొదలైందని, ఓటమి భయంతోనే ఓటర్లను ఇబ్బంది పెట్టే విధంగా అరాచక చర్యల కు పాల్పడుతున్నారని నరసరావుపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవింద్‌బాబు మండిపడ్డారు. నరసరావుపేట మండలం పెట్రూవారిపాలెంలో వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగస్తులంతా తెదేపా వైపే ఉండడంతో వైసీపీ నేతల్లో భయం మొదలైందన్నారు. ప్రశాంతంగా జరుగుతున్న బ్యాలెట్‌ ఓటింగ్‌ వద్ద అలజడి సృష్టించేందుకు యత్నిస్తున్నారని, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

సోమవారం నరసరావుపేట పట్టణం ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజీలో జరుగుతున్న పోస్ట ల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ మూకలు బూత్‌ల వద్దకు ప్రవేశించడం, లోపలే ప్రెస్‌ మీట్‌లు పెట్టడం, తెదేపాపై తప్పుడు ఆరోపణలు చేయడం, ఇవన్నీ వారి పిరికి చర్యలకు నిలువుటద్దమని విమర్శలు చేశారు. దాదాపు 30 మందికి పైగా వైసీపీకి చెందిన వ్యక్తులు ఎన్నికల కాంపౌండ్‌ లోపలికి ప్రవేశించడం దారుణమన్నారు. దీనికి తోడు ఎమ్మెల్యే గోపిరెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేయడం, వారి అనుచరులు పోలింగ్‌ బూత్‌ పరిసర ప్రాంతంలో సమస్యాత్మకంగా తిరగటం, తెలుగుదేశం పార్టీ నేతలపై దాడి చేయడం వంటి వాటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని.. మొదట ఉద్యోగస్తులే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. పోలీసులు ప్రశాంత ఎన్నికలకు సహకరించాలని కోరారు. ఎటువంటి ఘటనలు జరిగినా నష్టపోయేది అంతిమంగా ప్రజలేనని గుర్తుంచుకోవాలని హితవుపలికారు.