– వినుకొండ యువతి పోలీసులకు ఫిర్యాదు
వినుకొండ, మహానాడు: వైసీపీ నాయకుడు అత్తర్ నాగూర్ వలి తనను లైంగికంగా దగ్గరై, రెండుసార్లు గర్భం తీయించి ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమయ్యారని తనకు న్యాయం చేయాలని వినుకొండ పట్టణానికి చెందిన యువతి(27) శనివారం పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం బాధితురాలు మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది.
తనను నగ్నంగా వీడియో చిత్రీకరించి బెదిరించి, తనపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారని, ఎవరికైనా విషయం చెప్తే వీడియోలు బయటకు పంపుతానని తనని, తన తల్లిని బెదిరించి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మ నాయుడు అండతో తనను లొంగదీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై తనకు న్యాయం కోసం గతంలో పోలీసులను ఆశ్రయించినా వారు అప్పటి ఎమ్మెల్యేకి భయపడి కేసు నమోదు చేయలేదని బాధితురాలు తెలిపింది. తనను తనపై, తన తల్లి పై ఇటీవల నాగూర్ వలి తన అనుచరులతో వచ్చి దారుణంగా కొట్టి చంపేస్తామని బెదిరించారని వెల్లడించింది. కాగా అత్తర్ నాగూర్ తనను కాదని, బాపట్ల జిల్లా, కొమ్మాలపాడుకి చెందిన మరో యూవతిని పెళ్లిచేసుకునేందుకు నిశ్చితార్ధం చేసుకున్నారని, తనలా మరో అమ్మాయి జీవితం నాశనం కాకూడదనే తాను పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపింది.
మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్‌లపై నమ్మకంతో కేసు నమోదు చేసి తనకి న్యాయం చేస్తారనే ఆశతో వచ్చానని రోదించింది. కాగా బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి విచారణ చేపట్టినట్టు వినుకొండ పట్టణ సీఐ శోభన్ బాబు వెల్లడించారు.