– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు
తూబాడు, మహానాడు: వైసీపీ నేతలు వారి కళ్లకు కట్టుకున్న నీలి గంతలు విప్పుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృ ద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపిస్తాయని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్, సజ్జల నుంచి చాలామంది వైసీపీ నేతలు పదేపదే తమకు అలవాటైన తప్పుడు ప్రచారాలతోనే నెట్టుకురావాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. నాదెండ్ల మండలం జంగాలపల్లి, తూబాడులో ఆదివారం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు.
తూబాడులో రూ.15 లక్షలతో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణానికి, జంగాలపల్లిలో సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణానికి భూమిపూజ చేసి శిలా ఫలకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పల్లెపండుగ, మరోవైపు రోడ్లపై గుంతలు పూడ్చడం వంటి కార్యక్రమాల ద్వారా సంక్రాంతి నాటికి రాష్ట్రం రూపురేఖలు మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కంకణం కట్టుకుని పనిచేస్తున్నారన్నారు. కళ్లుండి అవి చూడలేని వైసీపీ నేతలందరూ ఇకనైనా తీరు మార్చుకోవాలని, లేదంటే ప్రజలే వారిని గ్రామాల్లో తిరగనివ్వరని, తరిమికొట్టే రోజులు త్వరలోనే వస్తాయన్నారు.