చంద్రబాబు ఇంటిపై దాడి.. నిందితులపై చర్యలకు ఫిర్యాదు
• మహిళపై అత్యాచారం.. ఫోన్‌లో రికార్డు చేసి, బెదిరింపులు
మంగళగిరి, మహానాడు: మాజీ మంత్రి జోగి రమేష్ అండదండలతో నాడు చీకట్లో దొంగల్లా వైసీపీ నేతలు కొల్లాటి బాలగంగాధరరావు, కొల్లాటి పోతురాజు, సత్యనారయణ, తిరుమాను రమేష్ లు రాత్రుల్లో వచ్చి కృత్తివెన్ను మండలం శీతనపల్లి వద్ద ఉన్న 50 ఎకరాల మంచినీటి చెరువులోని చేపల మొత్తాన్ని దోచుకెళ్లారని.. పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి దక్కాల్సిన సొమ్ములను కొట్టేశారని.. దీనిపై నాడు టీడీపీ నేతలు పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పెదసింగు దావీదు మంగళవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో అర్జీని ఇచ్చారు. చేపల తరలింపును గ్రామస్తులు అడ్డుకున్నా.. అక్కడికి వచ్చిన అధికారులే చేపల తరలింపునకు సహకరించి.. వైసీపీ నేతల తాయిలాలకు తలొంచారని.. వారి దోపిడీకి యథేచ్ఛగా సహకరించారని.. ఈ దోపిడీపై విచారించి, అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేతలు ఎమ్మెల్సీ అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, బీదా రవిచంద్ర, ఆచంట సునీత, ఉండవల్లి శ్రీదేవిలును విన్నవించారు. అంతేకాకుండా వివిధ చోట్ల నుంచి వచ్చిన వినతులను వారు పరిశీలించి, చర్యలకు ఆదేశించారు.
• కొల్లాటి పోతురాజు, బాలగంగాధరరావు, రేవు ఏసుబాబు, తిరుమాని సత్యనారాయణ, కొల్లాటి ఆంజనేయులు, ఏసుబాబు లు జోగి రమేష్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఇంటిపై మారణాయుధాలు, కర్రలు రాళ్లతో నాడు దాడి చేశారని.. వీళ్లపై డీజీపీ ద్వారా ఎంక్వైరీ చేయించి, చర్యలు తీసుకోవాలని కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం పల్లెపాలం గ్రామానికి చెందిన పెదసింగు దావీదు గ్రీవెన్స్ లో నేతలకు వినతి పత్రం అందించారు.
• తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే కాలనీకి చెందిన టైలర్ కుళాయప్ప అనే వ్యక్తి తనను అత్యాచారం చేసి సెల్ ఫోన్ లో రికార్డు చేసి… పదే పదే తనను కలవాలని బెదిరిస్తున్నాడని.. తన కూతుర్లను కూడా తన రూంకు తీసుకురావాలని బెదిరిస్తున్నాడని.. అతని నుండి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో బ్యూటీ పార్లర్ నడుపుకొంటున్న ఓ మహిళ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది.. వెంటనే పోలీసులు అధికారులకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని నేతలు ఆదేశించారు.
• కడప నగరం చిన్న చౌక్ వద్ద నివశిస్తున్న ఓలేటి హనుమంతరావు, తోట హరిప్రసాద్ తో పాటు పలువురు విజ్ఞప్తి చేస్తూ.. దాదాపు 100 మంది నుంచి చిట్టీలు కట్టించకుని రూ. 20 కోట్లతో పోతినేని నారాయణ ఇంట్లో ఉండే వ్యక్తి పరారయ్యాడని.. అతన్ని పట్టుకుని తమకు డబ్బులు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు కోరారు.
• సత్యసాయి జిల్లా ఓబులదేవరచెరువు మండలం లింగాలవారిపల్లి గ్రామానికి చెందిన సోమశేఖర్ రెడ్డి నేతల ముందు విజ్ఞప్తి చేస్తూ.. తన కొడుకు టాన్జానియా దేశానికి పనికోసం వెళ్లాడని.. పంపిన వారు వైసీపీకి చెంది వ్యక్తి అని.. తాము పల్లె రఘునాథరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరడంతో తప్పుడు కేసు పెట్టి తన కొడుకును ఇబ్బంది పెడుతున్నారని.. 10 రోజుల నుండి ఫోన్ కూడా చేయడంలేదని.. దయచేసి తమకు న్యాయం చేయాలని నేతలకు విన్నవించుకున్నారు. అర్జీలు స్వీకరించిన నేతలు టాన్జానియా ఎన్నారై విభాగంతో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేశారు.
• కర్నూలు టౌన్ లోని నంద్యాల చెక్ పోస్ట్ వద్ద కూల్ డ్రింగ్ షాపు పెట్టుకుని జీవనాధారం గడుపుతున్నామని.. దానిపైనే తమకు కుటుంబం ఆధారపడి ఉందని… తమ పిల్లలు చదువుకుంటున్నారని.. ఇటీవల ఆ కూల్ డ్రింక్ షాపు తొలగించడంతో జీవనాధారం పోయిందని ఆడపిల్లల చదువుకు ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని.. దయ చేసి తొలగించిన స్థలం వద్ద కూల్ డ్రింగ్ షాపు పెట్టుకొనేందుకు అనుమతి ఇప్పించవలసిందిగా కర్నూలుకు చెందిన మార్నేని మల్లేశ్వరి నేతలకు విజ్ఞప్తి చేశారు
• ప్రకాశం జిల్లా ఎస్ ఎన్ పాడు నియోజకవర్గం ఎండ్లూరు గ్రామంలో టీటీడీ దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, ఎంట్రన్సు ఆర్చి, కాంపౌండు వాలు నిర్మిస్తామని చెప్పి నమూనా పేపర్లు ఇచ్చి కొలతలు వేసుకెళ్లి 11.12.2022 న ఆలయ నిర్మాణానికి ఉత్తర్వులు ఇచ్చారని.. తరువాత ఆలయం మాత్రమే నిర్మిస్తామని.. కాంపౌడువాల్, ఆర్చి నిర్మించమంటున్నారని.. ఈ విషయాన్ని పరిశీలించి ఆలయంతో పాటు కాంపౌండ్ వాల్ ఆర్చి కూడా నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కె. రాము కోరారు.
• తన తండ్రి టైలరింగ్ వృత్తి చేస్తూ.. తను జనరల్ మెడిషన్ చదవుకోవడానికి రష్యాదేశానికి పంపారని.. మొదటి సంవత్సరం కోర్సు పూర్తి అయ్యిందని.. ఇంకా నాలుగు సంవత్సరాలు చదవాల్సి ఉందని.. ఇటీవల తన తండ్రి మరణించడంతో చదువుకోవడానికి ఆర్థిక సమస్య ఏర్పడిందని.. తన చదువుకు సాయం చేసి ఆదుకోవాలని తిరుపతి జిల్లా రేణిగుంట మండలానికి చెందిన పైనేటి చైతన్య కోరారు.
• పర్చూరు నియోజకవర్గం కారంచేడు మండలం నాయుడువారిపాలెంలో చీరాల కాలువ(ఆలేరు కాలువ) తవ్వకంలో తమ పొలంతో పాటు గ్రామంలోని రైతులది 119 ఎకరాలు పోయిందని.. దానికి నేటికీ నష్టపరిహారం ఇవ్వలేదని… అధికారులు దగ్గరకు వెళితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. తాము ఆత్మహత్య చేసుకుంటామన్నా ఇష్టం వచ్చింది చేసుకోమంటున్నారని.. రైతులమైన తమకు న్యాయం చేయాలని తానంగి వీరాంజనేయులు విజ్ఞప్తి చేశారు.
• ఏలూరు జూట్ మిల్లు మూసివేయడంతో విజయవాడకు వచ్చి పాలఫ్యాక్టరీ వద్ద వ్యాపారం చేసుకుంటుండగా.. వరదల కారణంగా తమ వ్యాపారం పోయి అప్పుల పాలయ్యామని.. తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, తనను ఆదుకోవాలని కె. రాజేష్ అనే వ్యక్తి గ్రీవెన్స్ లో అర్జీని ఇచ్చి అభ్యర్థించారు.
• ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలానికి చెందిన మేకల తిరుపతయ్య యాదవ్.. తాను 2018 లో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. 10 లక్షలు ఖర్చు పెట్టాడని.. ఇప్పటికి ఒక్క రూపాయి రాలేదని.. తన కుటుంబ ఆర్థిక పరిస్థితి భాగాలేదని భార్య చావుబతుకుల మధ్య ఉందని.. తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నాడు
• శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంట ఏపి రెసిడెన్సియల్ స్కూల్ నందు ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న కె. పద్మావతి అనే ప్రాధానోపాధ్యాయురాలు వైసీపీ నేతలకు అనుకూలంగా ఉండి స్కూల్ వాతావరణంలోకి రాజకీయాన్ని తీసుకు వచ్చి.. విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతోందని.. పలువురు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.
• రాబోవు డిఎస్సీ నోటిఫికేషన్ పరిమితి 46 సంవత్సరాలకు పెంచాలని.. పలువురు నిరుద్యోగులు నేతలను కలిసి అర్జిని ఇచ్చారు. 2018 నుండి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో చాలా మంది వయసు రిత్యా నష్టపోవాల్సి వస్తుంది.. వయోపరిమితి 44 సంవత్సరాలకు మరో రెండు సంవత్సరాలను పెంచాలని వేడుకున్నారు.
• చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం నెక్కొంది పంచాయతీకి చెందిన పెద్దఅలసాపురం గ్రామస్తులు విన్నవించుకుంటూ.. వెనుకబడిన తరగతి కుటుంబాల ప్రజలకు స్మశానవాటికకు స్థలం కేటాయించారని.. అయితే, దారి లేకపోవడంతో అంతిమసంస్కారాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని.. దయచేసి దారి సమస్యను పరిష్కరించాల్సిందిగా వారు వేడుకున్నారు.