ప్రాయశ్చిత్త దీక్షపై వైసీపీ వృథా ప్రేలాపాలను మానాలి

– గాదె, బోనబోయిన

గుంటూరు, మహానాడు: కలియుగ దైవం తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపశ్రుతికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ బాటలోనే ప్రాయశ్చిత్త దీక్ష స్వీకరించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన నాయకులు, వీర మహిళలతో కలిసి 28 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు మామిడి రామారావు స్థానిక నాయకులతో కలిసి గుంటూరు పట్టణ హౌసింగ్ బోర్డ్ లో ఉన్న శ్రీ సాయిబాబా దేవస్థానంలో ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ ప్రజలు గతంలో వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మి వారికి ఒక బాధ్యత అప్ప చెపితే, వారు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆదాయ వనరుగా మార్చుకొని, తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా ప్రవర్తించారన్నారు.

తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా పవన్‌ కల్యాణ్‌, జన సైనికులు, వీర మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ప్రాయశ్చిత్త దీక్షలు చేస్తుంటే, వైసీపీ వాళ్ళు చేసిన తప్పు ఒప్పుకోకపోగా కొత్త నాటకానికి తెర తీశారని విమర్శించారు. ఈనెల 28 వ తేదీన వైసీపీ ప్రాయశ్చిత్త చిత్త దీక్ష చేపట్టడం స్వాగతిస్తున్నామన్నారు. అంతేగాని ప్రాయశ్చిత్త దీక్ష మీద వృథా ప్రేలాపాలను మానుకోవాలని వైసీపీ నాయకులు మానుకోవాలని సూచించారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న స్పందన చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు వృథా ప్రేలాపాలను మానుకోవాలని హితవు పలికారు. అలాగే వైసీపీ వారు ఈనెల 28వ తేదీన ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టడం స్వాగతిస్తున్నామని, చేసిన తప్పు ఇప్పటికైనా తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం ఒక్క లడ్డు విషయంలోనే కాదు… తిరుమలలో ప్రతి వ్యవస్థను నాశనం చేశారని ఆరోపించారు. తప్పు చేసిన ఎవరైనా సరే శిక్ష అనుభవించక తప్పదన్నారు.