మేనిఫెస్టోతో మోసగిస్తున్న వైసీపీని సాగనంపాలి

మరోసారి జగన్‌కు బలికావొద్దు
తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌

గుంటూరు జిల్లా తెనాలి : మేనిఫెస్టో పేరు చెప్పి ప్రజలను మోసగిస్తున్న ప్రభుత్వాన్ని సాగనంపేందుకు అన్ని వర్గాల ప్రజలు సంసిద్ధులవుతున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్‌, జనసేన తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం మనోహర్‌ పట్టణంలోని 33, 34 వార్డుల్లో పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ కేవలం ఓట్ల కోసం ప్రజలను మోసం చేయడం కోసం ముఖ్యమంత్రి జగన్‌ మేనిఫెస్టోను విడుదల చేశారని, రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం కాదని విమర్శించారు. గత మేనిఫెస్టోని ఏ మేరకు అమలు చేశారు సవివరంగా తెలపాలని డిమాండ్‌ చేశారు.

ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. అన్ని రకాల పన్నుల భారాన్ని ప్రజ లపై మోపి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించడంలో విఫలమయ్యారని ధ్వజమె త్తారు. వార్డుల్లో పర్యటించినప్పుడు రక్షిత మంచినీటి సరఫరా రావడం లేదని ప్రజలు తమ దృష్టి తీసుకురావటం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 160 కోట్ల రూపాయలు పెట్టి రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, దానిని అమలు చేయకపోగా పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహించారని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు కూటమిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.