Mahanaadu-Logo-PNG-Large

భ‌విష్య‌త్తులో జ‌రిగే ప‌రిణామాల‌కు మీరే బాధ్య‌త

యువ‌కుడు డ‌యేరియా వ‌ల్ల చ‌నిపోతే ఏం స‌మాధానం చెబుతారు?
ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించి ఉంటే ఈ ప‌రిస్థితి ఎందుకొస్తుం ది
ముంద‌స్తుగా గుర్తించ‌గ‌లిగితే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కా దు
చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రించొద్దు
ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండొద్దు
సీజనల్ వ్యాధుల విస్తరణపై అధికారుల సమీక్షలో వైద్యమంత్రి సత్యకుమార్ ఆగ్రహం

అమ‌రావ‌తి: వైద్య ఆరోగ్య శాఖ‌లో సేవ‌ల్ని మ‌రింత మెరుగుప‌ర్చ‌డం ద్వారా ప్ర‌భుత్వానికి మంచి పేరు తీసుకురావాల‌నీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ చెప్పార‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ, వైద్య విద్యా శాఖ‌ల మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ తెలిపారు.
ముఖ్య‌మంత్రి ఆశ‌యాల‌క‌నుగుణంగా మ‌నమంద‌రం క‌లిసిక‌ట్టుగా, బాధ్య‌తాయుతంగా ప‌నిచేయాల‌న్నారు. డ‌యేరియా ప్ర‌బ‌లిన త‌ర్వాత చేప‌ట్టే చ‌ర్య‌ల కంటే ముంద‌స్తు చ‌ర్య‌ల వ‌ల్ల ప్రాణాల్ని కాపాడిన‌వార‌వుతార‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ అన్నారు. ఏ విధంగా నీరు క‌లుషిత‌మ‌వుతోంద‌న్న అంశంపై సంబంధిత శాఖ‌లతో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌నిచేయాల‌న్నారు.

డ‌యేరియాతో పాటు సీజ‌న‌ల్ వ్యాధులు, కీట‌క జ‌నిత వ్యాధుల‌పై ఏపీ స‌చివాల‌యం నుండి ఆయా జిల్లాల డిఎంహెచ్వోలు, డిసిహెచ్ య‌స్‌లు, జిజిహెచ్‌ల సూప‌రింటెండెంట్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ డయేరియాపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా వార్త‌లొస్తాయ‌ని, చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా వ్య‌వ‌హ‌రించొద్ద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.

ఇటువంటి ప‌రిస్థితిని చూసి సిగ్గుప‌డాల‌న్నారు. ఏదో మ‌మ అనిపించుకుని పైవారికి చెప్పాశాం క‌దా అనే వైఖ‌రి స‌రికాద‌న్నారు. డ‌యారియా ప్ర‌బ‌లి కేసులు పెరిగాక ఆందోళ‌న ప‌డ‌డం కంటే క్షేత్ర స్థాయిలో ముందే అలెర్ట్ అయి ముంద‌స్తుగా గుర్తించ‌గ‌లిగితే ఈ ప‌రిస్థితి వ‌చ్చేది కాద‌న్నారు. మిగ‌తా శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని ప‌నిచేస్తే చాలా వ‌ర‌కు నివారించ‌గ‌లిగేవార‌న్నారు. డ‌యారియా ప్ర‌బ‌లుతున్నా కింది స్థాయి సిబ్బంది ఏంచేస్తున్నార‌ని మంత్రి ప్ర‌శ్నించారు.

పైఅధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ కూడా ప‌టిష్టంగా ఉండాల‌న్నారు. ఉద్యోగ ధ‌ర్మ‌మే కాకుండా సామాజిక బాధ్య‌త‌గా వ్య‌వ‌హించాల‌ని, ప్ర‌జ‌ల ప్రాణాల‌కు జ‌వాబుదారుల‌గా ఉండాల‌ని మంత్రి ఉద్ఘాటించారు. క్లోరినేష‌న్ స‌రిగా జ‌ర‌గుతోందా లేదా అనే విష‌యం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత శాఖ అధికారులతో ఎప్ప‌టిక‌ప్పుడు చెక్ చేసుకోవాల‌న్నారు. ప‌రిస‌రాల శుభ్ర‌తే కాకుండా వ్య‌క్తిగ‌త శుభ్ర‌త విష‌యంలో కూడా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించాల‌న్నారు.

271 వాట‌ర్ సోర్సెస్ ల‌ను గుర్తించిన వెంట‌నే ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌లిగించి ఉంటే ఈ ప‌రిస్థితి ఎందుకొస్తుంద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. 27 ఏళ్ల యువ‌కుడు డ‌యేరియా వ‌ల్ల చ‌నిపోతే ఏం స‌మాధానం చెప్తార‌న్నారు. ఉద్యోగులు ఉదాసీనంగా నిర్ల‌క్ష్యంగా ఉండ‌కూడ‌ద‌న్నారు. బ‌ద్ధ‌కాన్ని వీడాల‌న్నారు. గ‌తంలోలా ఈ ప్ర‌భ‌త్వం హ‌యాంలో వ్య‌వ‌హ‌రిస్తే భ‌విష్య‌త్తులో జ‌రిగే ప‌రిణామాల‌కు మీరే బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండొద్ద‌న్నారు.

వైద్య ఆరోగ్య శాఖ‌ను ప్ర‌క్షాళ‌న చేసే దిశ‌గా మునుముందు చ‌ర్య‌లుంటాయ‌న్నారు. త్వ‌ర‌లో జిల్లాల్లో ప‌ర్య‌టించి ఆసుప‌త్రుల ప‌నితీరును ప‌రిశీలిస్తాన‌న్నారు. ఆసుప్ర‌తుల్ని బ‌లోపేతం చేసేందుకు ఏమేమి చ‌ర్య‌లు తీసుకోవాలో తెలుసుకుంటామ‌ని, లోటుపాట్ల‌ను స‌రిదిద్దుతామ‌నీ చెప్పారు. మ‌లేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధుల విష‌యంలో కూడా అత్యంత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు, ఆరోగ్య‌శ్రీ సిఇవో ల‌క్షీషా, డిఎంఇ డాక్ట‌ర్ న‌ర‌సింహం, డిహెచ్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి త‌దిత‌రులు వీడియో కాన్ఫ‌రెన్స్ లో పాల్గొన్నారు.