-జేబీవీఎస్ సంస్థ సేవలు ప్రశంసనీయం 
-నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి మణికంఠ 
కడప, మహానాడు: భారతదేశంలో యువతని ప్రోత్సహించి నవ భారతాన్ని నిర్మించే దిశగా ముందుకు తీసుకెళ్లాలని నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువ అధికారి మణికంఠ అన్నారు. కడపలో జేబీవీఎస్ చేస్తున సేవ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఈ సంస్థలు ఇప్పటివరకు వివిధ రక్తదాన శిబిరాల్లో, అత్యవసర, అస్వస్థత పరిస్థితుల్లో ఉన్నవారికి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు రిమ్స్ రక్తనిధి కేంద్రానికి 1029 యూనిట్లు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్త నిధి కేంద్రానికి 391 యూనిట్లు రక్తదానం చేశారన్నారు.
ఈ సందర్బంగా నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి మణికంఠ చేతుల మీదుగా జేబీవీఎస్ సంస్థ వ్యవస్థాపకుడు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్ అయిన అశోక్ ను సన్మానించారు. రెడ్ క్రాస్ సొసైటీ శివశంకర్ రెడ్డి, రిమ్స్ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ లు అశోక్ కు ప్రశంసా పత్రం అందజేశారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు జేబీవీఎస్ సంస్థ స్థాపించి కడప నగరంలో వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. సంస్థ సభ్యులు ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి యువతకి మార్గదర్శకంగా నిలవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు, ఎన్ వై కే వాలంటీర్లు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
 
								